Begin typing your search above and press return to search.

హైదరాబాద్ శివారులో దారుణం.. ప్రెగ్నెంట్ భార్యను కిరాతకంగా చంపేశాడు

గర్భవతి అయిన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. మహానగర శివారులోని మేడిపల్లి పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   24 Aug 2025 9:50 AM IST
హైదరాబాద్ శివారులో దారుణం.. ప్రెగ్నెంట్ భార్యను కిరాతకంగా చంపేశాడు
X

మరో కిరాతకం వెలుగు చూసింది. షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. పది రోజుల క్రితం పదేళ్ల బాలికను.. పదో తరగతి చదివే కుర్రాడు అత్యంత దారుణంగా హత్య చేయటం.. అది కూడా క్రికెట్ బ్యాట్ ను దొంగలించే వేళలో తనను అడ్డుకోవటంతో చంపిన వైనం తెలిసిందే. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే.. మరో దారుణం హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.

గర్భవతి అయిన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. మహానగర శివారులోని మేడిపల్లి పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. సాధారణంగా భార్య ప్రెగ్నెంట్ అయితే అపురూపంగా చూసుకుంటారు. ఆమెకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి బయటకు తీసుకెళ్లి పడేసే క్రమంలో అతడి దారుణాన్ని గుర్తించారు స్థానికులు.

ఇంటి నుంచి వస్తున్న శబ్దాలతో అనుమానం వచ్చిన పొరుగు ఇంటి వారు కొందరు వెళ్లి చూడగా.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. బయట పడేసేందుకు సిద్ధమవుతున్న కిరాతక భర్తను గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి.. మహేందర్ లు ప్రేమపెళ్లి చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వారు బోడుప్పల్లో ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. అందునా ప్రెగ్నెంట్ అయిన వేళ.. ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేశాడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన గుట్టు ఏమిటన్నది తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.