Begin typing your search above and press return to search.

సినిమా పైరసీ.. సినిమాను తలపించేలా

ఇటీవల హైదరాబాద్ పోలీసులు బ్రేక్ చేసిన పైరసీ రాకెట్ వ్యవహారం టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది.

By:  Garuda Media   |   2 Oct 2025 9:49 AM IST
సినిమా పైరసీ.. సినిమాను తలపించేలా
X

ఇటీవల హైదరాబాద్ పోలీసులు బ్రేక్ చేసిన పైరసీ రాకెట్ వ్యవహారం టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఎంతో పకడ్బందీగా కొత్త సినిమాలను పైరసీ చేసి కోట్ల రూపాయలకు సొమ్ము చేసుకుంటూ.. ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెడుతున్న ముఠాను హైదరాబాద్ మాజీ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని టీం కొన్ని నెలల పాటు కృషి చేసి, రెండు కోట్లకు పైగా విలువైన పరికరాల సాయంతో వారిని నిందితులను పట్టుకున్న తీరు ప్రశంసలందుకుంటోంది.

ఈ ముఠాలో బీహార్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ కుర్రాడి పేరు.. అశ్వినికుమార్. చిన్న వయసులోనే హ్యాకింగ్ మీద పట్టు సాధించిన అతను.. పైరసీ ద్వారా కోట్లు సంపాదించిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరి కంటే ముందుగా కొత్త సినిమాలను చూడాలనే కుతూహలంలో అతను మొదలుపెట్టిన పైరసీ.. తర్వాత అతడికి వ్యాపారంగా మారింది. డిజిటల్ కంటెంట్ ఫ్లాట్ ఫామ్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేయడం.. తద్వారా కొత్త చిత్రాలను పైరసీ చేయడం.. పైరసీ వెబ్ సైట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం.. ఇదీ కొన్నేళ్లుగా అతడి రొటీన్.

నాని సినిమా ‘హిట్-3’ థియేటర్లలో రిలీజ్ కావడానికంటే 18 గంటల ముందే యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్ నుంచి అతను కాపీ చేసి ఆన్ లైన్లో లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘కిక్-3’ రిలీజ్ రోజే హెచ్‌డీ ప్రింట్ బయటికి రావడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇంకా గేమ్ చేంజర్, తండేల్ సహా పలు చిత్రాలను ఇలాగే పైరసీ చేసి హెచ్‌డీ ప్రింట్లను పైరసీ సైట్లకు అమ్మి క్రిప్టో కరెన్సీ ద్వారా సొమ్ము చేసుకున్నాడట. పోలీసులు అధునాతన పరికరాలు వాడి ఎంతో చాకచక్యంగా అతణ్ని పట్టుకున్నారు. పాట్నాలోని తన ఇంటి చుట్టూ 20కి పైగా సీసీ కెమెరాలు పెట్టి వాచ్ చేస్తున్న అతను.. పోలీసులు తన కోసం వచ్చిన విషయం తెలసుకుని డేటా డెలీట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈలోపే పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.