Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్.. చిరంజీవి ఓ బాధితుడే.. ఆయన రియాక్షన్ ఇదీ

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తోందని, కానీ దానితో పాటు పలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

By:  A.N.Kumar   |   31 Oct 2025 11:13 AM IST
డీప్ ఫేక్.. చిరంజీవి ఓ బాధితుడే.. ఆయన రియాక్షన్ ఇదీ
X

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తోందని, కానీ దానితో పాటు పలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారంలోకి వచ్చిన డీప్‌ఫేక్ వీడియోలపై ఆయన ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఏక్తా దివస్ 2K రన్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిరంజీవి ఈ అంశాలపై మాట్లాడారు.

చిరంజీవి మాట్లాడుతూ “టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా వస్తుంది. నాపై డీప్‌ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు చాలా బలంగా ఉన్నారు. ప్రజలు భయపడకూడదు” అని తెలిపారు.

డీప్‌ఫేక్: పెద్ద ముప్పు - చట్టాలు రావాలి

డీప్‌ఫేక్ టెక్నాలజీని “పెద్ద గొడ్డలిపెట్టు”గా అభివర్ణించిన చిరంజీవి, ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. "ప్రభుత్వాలు తక్షణమే దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. టెక్నాలజీని ఆహ్వానించాలి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం జరిగితే సమాజం ప్రమాదంలో పడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వివాదం ఏంటి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా ఇతర సాంకేతికతలను ఉపయోగించి చిరంజీవి ముఖం, రూపాన్ని మార్ఫింగ్ చేసి, అశ్లీల వీడియోలను సృష్టించి, కొన్ని వెబ్‌సైట్లు , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలు తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు ముందు, తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలు వాడరాదని కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు కూడా చిరంజీవి పొందారు.

చిరంజీవి ఫిర్యాదు మేరకు, కోర్టు ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టం (IT Act), భారతీయ న్యాయ సంహిత (BNS), ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) యాక్ట్ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీప్ ఫేక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన మూలాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు.

పోలీసుల కఠిన చర్యలు: సజ్జనార్ వెల్లడి

ఈ డీప్‌ఫేక్ కేసును సీరియస్‌గా తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. “డీప్‌ఫేక్ వీడియోల వెనుక ఉన్న సైబర్ నేరస్తులపై దృష్టి సారించాం. మూలాలను గుర్తించడానికి ప్రత్యేక టీమ్ పనిచేస్తోంది” అని ఆయన వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఆయన చెప్పారు.డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ మ్యూల్స్ వంటి మోసాలకు ప్రజలు ఇంకా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు కూడా స్వల్ప డబ్బు కోసం అకౌంట్లు ఇవ్వడం వల్ల పెద్దలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సజ్జనార్ వివరించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెన్షన్, నిందితుల వేట

ఈ సందర్భంగా, విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేసినట్లు సజ్జనార్ ప్రకటించారు. అలాగే, ఈ కేసులో నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు. నిందితుల్లో ఒకరైన ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. “నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తాం” అని సీపీ స్పష్టం చేశారు.

డీప్‌ఫేక్‌ల ముప్పు దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రముఖుల పేరుతో నకిలీ వీడియోలు, వాయిస్ క్లిప్స్ సృష్టించడం కొత్త సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆవేదన సమయోచితమని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, సైబర్ నిపుణులు కలిసి డీప్‌ఫేక్ దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన సమయం వచ్చింది.