Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో హత్య చేసి.. యూపీలో భారీ దోపిడీకి స్కెచ్ తో దొరికేశారు

కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్ లోని ఒక మాజీ ఐఏఎస్ అధికారి సతీమణిని..ఆయన ఇంట్లో పని చేసే వారు దారుణంగా హత్య చేసి.. ఇంట్లోని నగలతో పారిపోవటం తెలిసిందే.

By:  Garuda Media   |   19 Oct 2026 4:00 PM IST
హైదరాబాద్ లో హత్య చేసి.. యూపీలో భారీ దోపిడీకి స్కెచ్ తో దొరికేశారు
X

కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్ లోని ఒక మాజీ ఐఏఎస్ అధికారి సతీమణిని..ఆయన ఇంట్లో పని చేసే వారు దారుణంగా హత్య చేసి.. ఇంట్లోని నగలతో పారిపోవటం తెలిసిందే. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని అప్పట్లో పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఈ చోరీతో సంబంధం ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నా.. దీనికి కారణమైన అసలోళ్లు మాత్రం తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి.

అయినప్పటికి పట్టువదలని విక్రమార్కుల మాదిరి శ్రమించిన పోలీసులు తాజాగా వేసిన స్కెచ్ లో దొరికిపోయారు. ఈ ఉదంతంలో ట్విస్ట ఏమంటే.. ఒక భారీ చోరీకి ప్లాన్ చేసిన నిందితులను.. హైదరాబాద్ పోలీసులు పట్టేశారు. మాజీ ఐఏఎస్ సతీమణిని హత్య చేసి చోరీ చేసిన పనోళ్లు.. ఈ దారుణ ఉదంతం తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దేశ సరిహద్దులు దాటేసి నేపాల్ కు వెళ్లి తలదాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశం వెళ్లి నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవటం అంత సాధ్యమయ్యే పని కాదు.

దీంతో.. వారి కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్ పోలీసులకు తాజాగా అందుకున్న సమాచారంతో పక్కా ప్లాన్ వేశారు. నేపాల్ కు పారిపోయిన నిందితులు మరో భారీ చోరీకి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తమ గ్యాంగ్ లోని వారంతా ఒకేసారి ఒకే చోటుకు వెళితే పోలీసులకు చిక్కుతామన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా సుమారు పదిహేను రోజుల క్రితం యూపీ.. బిహార్.. ఢిల్లీ తదితర ప్రాంతాలకు వేర్వేరుగా వెళ్లి అక్కడ దాక్కున్నారు.

మాజీ ఐఏఎస్ సతీమణి హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల మీద నెలల తరబడి నిఘా పెట్టారు.ఎట్టకేలకు వారు మళ్లీ భారీ చోరీలకు ప్లాన్ చేసిన వివరాల్ని గుర్తించారు. నేపాల్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా భారీ చోరీ చేయటం కోసం ఎదురుచూస్తున్న వారిని వేర్వేరుగా పట్టేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ నగర పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు తీసుకొచ్చి వారిని విచారిస్తున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులకు నలుగురు పోలీసుల అదుపులో ఉండగా.. మరో ముగ్గురు నేపాల్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే వీలుంది.