అర్థరాత్రి వేళ.. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్
శుక్రవారం అర్థరాత్రి వేళ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కవచ్ ఆసక్తికరంగానే కాదు.. హైదరాబాద్ సీపీ విసి సజ్జన్నార్ మార్క్ ను ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది.
By: Garuda Media | 6 Dec 2025 10:17 AM ISTశుక్రవారం అర్థరాత్రి వేళ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కవచ్ ఆసక్తికరంగానే కాదు.. హైదరాబాద్ సీపీ విసి సజ్జన్నార్ మార్క్ ను ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది. శాంతి భద్రతల్ని పటిష్టం చేసే పనిలో భాగంగా ఆయన చేపట్టిన ఆకస్మిక నాకాబందీతో నగరంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉందన్న అంశంతో పాటు.. మరిన్ని అంశాలపై మరింత అవగాహన కలిగేలా చేసిందని చెప్పాలి. అంతేకాదు.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా ఇంత భారీ ఎత్తున నాకాబందీని నిర్వహించారని చెబుతున్నారు.
ఇంతకూ ఆపరేషన్ కవచ్ అంటే మరేమిటో కాదు.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీస్ బాసులు డిసైడ్ చేసిన ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తారు. వందలాది పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. దీంతో.. సంఘ విద్రోహ శక్తుల్ని గుర్తించటం తేలిక అవుతుంది. ఇలాంటిదే శుక్రవారం రాత్రి వేళలో హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 5 వేల మంది పోలీసు సిబ్బందితో హైదరాబాద కమిషనరేట్ పరిధిలోని 150ప్రాంతాల్లో నిర్వహించారు.
అకస్మిక తనిఖీలతో అనుమానాస్పద వాహనాల్ని గుర్తించారు. సరైన పత్రాలు లేని వారిని గుర్తించేందుకు వీలు కలుగుతుంది. తాజాగా నిర్వహించిన ఆపరేషన్ కవచ్ లో భాగంగా లా అండ్ ఆర్డర్.. ట్రాఫిక్.. టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మడ్ రిజర్వ్.. బ్లూ కోల్ట్స్.. పెట్రోలింగ్ టీంలు సంయుక్తంగా పాల్గొన్నాయి. అనుమానాస్పద కదలికల్ని గమనిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు.
