Begin typing your search above and press return to search.

మద్యం తాగిన వారికి ఈ రాత్రి ఫ్రీ టాన్స్ పోర్టేషన్ సర్వీస్!

అవును... హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలకు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయాయని అంటున్నారు.

By:  Raja Ch   |   31 Dec 2025 11:23 AM IST
మద్యం తాగిన వారికి ఈ రాత్రి ఫ్రీ టాన్స్  పోర్టేషన్ సర్వీస్!
X

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న జనం.. గడియారం వైపు చూడటం అప్పుడే మొదలుపెట్టారని అంటున్నారు. త్వరగా రాత్రి అయితే.. వేడుకలు మొదలుపెట్టెయ్యొచ్చని భావిస్తున్నారు. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపితే దబిడి దిబిడే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

అవును... హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలకు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయాయని అంటున్నారు. ఇక సాయంత్రం అవ్వడమే ఆలస్యం.. సూర్యుడు అస్తమించడమే లేటు.. వేగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడమే తరువాయి అని చెబుతున్నారు. మరోవైపు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రధానంగా ఈవెంట్లు నిర్వహించే వారు.. కెపాసిటీకి మించి ఎక్కువ టిక్కెట్లు అమ్మకూడదని.. పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచిస్తున్నారు.

మరోవైపు.. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలు జీరో డ్రగ్ విధానంలో జరిగేలా పోలీసులు పక్కా ప్లానింగ్ తో ముందుకు కదులుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో.. మద్యం సేవించిన తర్వాత ఎవరూ వాహనాలు నడపొద్దని.. ఎక్కడికక్కడ డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు ఉంటాయని.. తీరా పట్టుబడిన తర్వాత.. మా నాన్న ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా వంటి కబుర్లు చెప్పకుండా.. సైలంట్ గా వాహనం పక్కన పెట్టేసి, పిలిచినప్పుడు కోర్టుకు రావాలని సీపీ సజ్జనార్ చెప్పిన పరిస్థితి!

ఈ సమయంలో మందుబాబుల మేలు కోసం అన్నట్లుగా ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా... న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు తెలిపింది. ఆ సంస్థే... 'తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ)'. డిసెంబర్‌ 31 రాత్రి 11 నుంచి 1 గంట వరకు తాము ఉచిత సేవలు అందిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెబుతోంది!

ఈ సమయంలో మద్యం తాగినవారు ఉచిత ట్రాన్స్ పోర్టేషన్ సేవలు పొందాలనుకుంటే... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో 8977009804 నంబర్ కు కాల్ చేయాలని టీజీపీడబ్ల్యూయూ సంస్థ తెలిపింది. ఈ ఫ్రీ రైడ్ సేవల కోసం కార్లు, ఆటోలు, ఈవీ బైక్ లు కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.