న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేస్తున్నారా.. ఈ పోలీస్ అలర్ట్స్ మీకోసమే!
అవును... న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు మొదలైపోయాయని అంటున్నవేళ.. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Raja Ch | 21 Dec 2025 4:00 AM ISTదేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమైపోయాయని అంటున్నారు. ఇక టికెటెడ్ ఈవెంట్స్ ల ప్రకటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోనూ సందడి ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలకు, ఈవెంట్ నిర్వాహకులకు పలు హెచ్చరికలతో కూడిన సూచనలు చేస్తున్నారు.
అవును... న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు మొదలైపోయాయని అంటున్నవేళ.. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని అన్నారు. ఇక ఈ టికెట్ ఈవెంట్ నిర్వహిస్తే దానికి ముందుగానే అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా.. ఆ ఈవెంట్ కు ఎంతమంది వస్తున్నారు.. ఎన్ని టిక్కెట్లు అమ్ముతున్నారు వంటి వివరాలు వెల్లడించాలని తెలిపారు.
ఇదే సమయంలో ప్రధానంగా పార్కింగ్ ఎలా ఏర్పాటు చేస్తుందీ చెప్పాలని డీసీపీ తెలిపారు. ఈవెంట్ తీసుకునే రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏవైనా ప్రమాదాలు జరిగితే అందుకు ఈవెంట్ నిర్వాహకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇదే క్రమంలో.. మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం కఠినచర్యలు తప్పవని చెప్పిన డీసీపీ.. తాగి ఇళ్లకు వెళ్తున్నవాల్లు డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
ఇదే సమయంలో స్పందించిన హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్.. న్యూ ఇయర్ వేడుకలు కేవలం ఆనందం, ఆహ్లాదం కోసం మాత్రమే ఉండాలని.. అలా కాకుండా హద్దు మీరి డ్రగ్స్ వంటి కార్యకలాపాల వరకూ వెళ్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలని.. డ్రగ్స్ పై లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఈగల్ టీమ్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఈవెంట్స్ లో సామర్థ్యానికి మించి టిక్కెట్లు అమ్మకూడదని.. ఒక వేళ ఆ ఈవెంట్లకు ఎవరైనా సెలబ్రెటీలు వస్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని.. దానివల్ల భద్రత కల్పించడం తేలిక అవుతుందని అన్నారు. అదే విధంగా.. పార్టీలు, పబ్బులకు మైనర్లను అనుమతించకూడదని.. 31 అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. సంబరాల పేరుతో మద్యం సేవించి రోడ్లపైకి వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు!
