హైదరాబాద్.. స్కై వాక్స్.. గేమ్ చేంజర్ కానుందా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోజురోజుకూ విస్తరిస్తూ, ప్రపంచ శ్రేణి నగరాల సరసన సగర్వంగా నిలుస్తోంది.
By: A.N.Kumar | 24 Oct 2025 10:00 PM ISTతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోజురోజుకూ విస్తరిస్తూ, ప్రపంచ శ్రేణి నగరాల సరసన సగర్వంగా నిలుస్తోంది. నగర జనాభా పెరుగుదలతో పాటు, వాహనాల సంఖ్య కూడా అపారంగా పెరగడంతో, రోడ్లపై ట్రాఫిక్ తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ భారం కారణంగా పాదచారులు రోడ్డు దాటడం, నడవడం అత్యంత కష్టసాధ్యంగా మారింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రతిరోజూ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
పాదచారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
పాదచారుల భద్రత, సౌకర్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఆరు కొత్త స్కై వాక్స్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ స్కై వాక్స్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గడంతో పాటు, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
*మొదటి దశలో ఎంపికైన ఆరు ప్రాంతాలు
నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఈ ఆరు ప్రదేశాలను మొదటి దశ నిర్మాణానికి ఎంపిక చేశారు. అఫ్జల్‌గంజ్, మదీనా, లక్డీకాపూల్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ-జంక్షన్..
ఈ ఆరు స్కై వాక్స్ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు (DPRలు) సిద్ధం చేయాలని హైదరాబాదు మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)కి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఉప్పల్ స్కైవాక్ స్ఫూర్తితో..
ఇప్పటికే నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్ట్ విజయవంతమై ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంది. దీనిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకువెళుతోంది. ఉప్పల్ స్కైవాక్ తరహాలోనే, ఈ కొత్త స్కైవాక్‌లు కూడా మెట్రో స్టేషన్లు, బస్‌స్టాప్‌లు, ప్రముఖ వాణిజ్య కేంద్రాలను కలుపుతూ రూపకల్పన చేయబడనున్నాయి.
అలాగే, మెహదీపట్నం వద్ద స్కై వాక్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మెట్రో స్టేషన్‌ను కలుపుతూ మరో స్కైవాక్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సర్వేలో తేలిన వాస్తవాలు
లీ అసోసియేట్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో, హైదరాబాద్‌లోని 23 ప్రధాన ప్రాంతాల్లో స్కై వాక్స్ అవసరం ఉందని తేలింది. అందుకే తొలి దశలో అత్యంత రద్దీగా ఉండే ఈ ఆరు ప్రదేశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి అధునాతన సదుపాయాలను విస్తరించనున్నట్లు సమాచారం.
ఈ స్కై వాక్స్ నిర్మాణం పూర్తి కావడంతో స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో పాదచారుల భద్రతకు, సౌకర్యానికి కొత్త ఊపిరి పోసినట్లవుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రమాదాలు తగ్గి, నగర జీవనం మరింత సౌకర్యవంతంగా మారేందుకు ఇది శుభసూచకం.
