నెట్ ఫ్లిక్స్.. హైదరాబాద్ కు వచ్చేసిందోచ్
తెలంగాణకు.. ఏపీకి ఉన్న అతి పెద్ద వ్యత్యాసం హైదరాబాద్. ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదు.
By: Garuda Media | 7 March 2026 10:02 AM ISTతెలంగాణకు.. ఏపీకి ఉన్న అతి పెద్ద వ్యత్యాసం హైదరాబాద్. ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదు. హైదరాబాద్ లో అరగంట తిరిగితే.. ఏపీకి తెలంగాణకు మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్న హైదరాబాద్ కు ఇప్పటివరకు రాని కొన్ని దిగ్గజ సంస్థలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. బెంగళూరుతో పోలిస్తే.. మౌలిక సదుపాయాల విషయంలో తెలంగాణ పాలకులు ప్రదర్శిస్తున్న ముందుచూపు భాగ్యనగర బ్రాండ్ ఇమేజ్ ను అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు ఇక్కడి ప్రజలు.. వాతావరణ పరిస్థితులు అన్ని సానుకూలంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రానుంది. ఈ నెల 12న నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలోకి నెట్ ఫ్లిక్స్ అడుగు పెట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా.. తాజా విస్తరణను సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబయిలో కార్యాలయం ఉన్న సదరు సంస్థ.. తన రెండో కార్యాలయానికి కేంద్రంగా హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంది. తాజా విస్తరణతో హైదరాబాద్ లో యానిమేషన్.. విజువల్ ఎఫెక్ట్స్.. గేమింగ్ అండ్ కామిక్స్ రంగం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్ లో ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత వీఎఫ్ ఎక్స్ సంస్థలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్ ఎక్స్ సేవల్ని అందిస్తున్న ఘనత హైదరాబాద్ సొంతం.
వార్నర్ బ్రదర్స్.. డిస్నీ.. స్కైలైన్ వీఎఫ్ఎక్స్.. మాటెల్.. బార్న్ స్మార్ట్ వీఎఫ్ఎక్స్.. ఉబిసాఫ్ట్ లాంటి సంస్థలు ఉన్నాయి. గతంలో హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ హైదరాబాద్ లోకి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఎం అండ్ ఎం క్యాప్ ల్యాబ్ ఈ కోవకు చెందిందే. తాజా పరిణామంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది.బలమైన కంపెనీలు రావటం ఒక మహానగరానికి ఎంత ముఖ్యమో.. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ లాంటి పాపులర్ సంస్థలు అడుగు పెట్టటం ద్వారా హైదరాబాద్ మహానగర ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పాలి.
