భారీ వర్షం వేళ ఇదేం దారుణం? హైదరాబాద్ మెట్రోపై నిప్పులు
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరాన్ని చిగురుటాకులా వణికించిన వర్షం కురిసిన వైనం గుర్తుండే ఉంటుంది. కొద్ది సమయంలోనే కుండపోతగా కురిసిన భారీ వర్షం నగర జీవుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
By: Garuda Media | 1 Sept 2025 3:19 PM ISTకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరాన్ని చిగురుటాకులా వణికించిన వర్షం కురిసిన వైనం గుర్తుండే ఉంటుంది. కొద్ది సమయంలోనే కుండపోతగా కురిసిన భారీ వర్షం నగర జీవుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరి.. ముఖ్యంగా ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో వ్యవహరించిన తీరుకు సంబంధించిన కొన్ని వివరాలు కాస్త ఆలస్యంగా వెలుగు చూశాయి. ఓవైపు ప్రయాణికులు తగ్గారని.. ఆశించినంత స్థాయిలో పెరగలేదని తరచూ వాపోయే ఎల్ అండ్ టీ.. హైదరాబాద్ మెట్రో సంస్థ తీరా ప్రయాణికులు వస్తే.. నిర్దయగా వ్యవహరించిన తీరు వెలుగు చూసింది.
భారీవర్షం పడుతున్న వేళ.. స్టేషన్ లోకి మితిమీరిన రద్దీ కారణంగా అనుమతించకపోవటం ఒక ఎత్తు అయితే.. భారీ వర్షానికి తడిచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. స్టేషన్ బయట ఉన్న మెట్ల వద్దకు కూడా రానివ్వని తీరు వెలుగు చూసి.. ఆశ్చర్యపోయేలా చేసింది. హైదరాబాద్ మెట్రోకు సంబంధించినంత వరకు అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ముందు ఉంటుంది రాయదుర్గం టెర్మినల్. నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు నడిచే ఈ మార్గాన్ని ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున వినియోగించుకుంటూ ఉంటారు. వేలాది మంది ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
జులై 26న జోరున వర్షం కురుస్తున్న వేల.. ఐటీ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు రాయదుర్గం స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అప్పటికే ప్లాట్ ఫాంలు.. స్టేషన్ కాన్ కోర్స్ లో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇంకా వస్తున్న ప్రయాణికుల్ని స్టేషన్ లోకి రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా ప్రయాణికులు స్టేషన్ వద్ద ఉన్న మెట్ల వద్దకు వచ్చేందుకు కూడా అనుమించకుండా ప్రయాణికుల్ని సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బందిపై పలువురు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. స్టేషన్ లో వెయిట్ చేసేందుకు తగిన స్థలం లేకపోవటంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాయదుర్గం టర్మినల్ స్టేషన్ సమీపంలోనే 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మెట్రోకు కేటాయించింది.
ఒప్పందంలో భాగంగా కింది అంతస్తులు.. సెల్లార్లలో మెట్రోరైలు ప్రయాణికులకు పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ఆపై ఆఫీసులు.. మాల్స్ నిర్మించి వాటి లీజు.. అద్దెల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఒప్పందం చేసుకున్నారు. తరచూనష్టాలు వస్తున్నట్లుగా చెప్పే ఎల్అండ్ టీ మెట్రో.. ఈ స్థలాన్ని మూడో పార్టీకి దీర్ఘకాలిక లీజుకు కట్టబెట్టి సుమారు రూ.వెయ్యి కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంది.
అదే సమయంలో ప్రయాణికులకు ఏర్పాటు చేయాల్సిన పార్కింగ్ వసతిని గాలికి వదిలేసింది. భారీ వర్షం వేళ.. స్టేషన్ బయట.. అందునా మెట్ల మార్గం వద్ద తలదాచుకునేందుకు కూడా రానివ్వని నిర్దయను ప్రదర్శించింది. ఈ తీరుపై ప్రభుత్వం విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుకుంటున్నారు.
