హైదరాబాద్ మెట్రోరైల్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్? నిజమేనా?
తాజాగా హైదరాబాద్ మెట్రోలో కీలక భాగస్వామి అయిన దిగ్గజ ఎల్ అండ్ టీ సంస్థ బయటకు వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
By: Garuda Media | 18 Sept 2025 10:55 AM ISTహైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న పద్దెనిమిదేళ్లుగా హైదరాబాద్ మెట్రోకు ఎండీగా వ్యవహరిస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ రవాణా సలహాదారుగా మార్చేయటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మెట్రోలో కీలక భాగస్వామి అయిన దిగ్గజ ఎల్ అండ్ టీ సంస్థ బయటకు వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మెట్రో రైలు తమకు గుదిబండగా మారిందన్న మాట ఎల్ అండ్ టీ నోట వస్తోంది. ఈ మధ్యనే ప్రభుత్వానికి ఈ సంస్థ ఒక లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.
దీని సారాంశం.. రూ.6వేల కోట్లు ఇస్తే తాము హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోతామని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తరచూ ఏదో ఒక సందర్భంలో ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోతామని వ్యాఖ్యానిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థను పంపేస్తే ఎలా ఉంటుంది? మెట్రోరైలు నిర్వహణ బాధ్యతను మనమే చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోకి రేవంత్ సర్కారు వచ్చినట్లుగా చెబుతున్నారు.
దీనికి తోడు.. ప్రస్తుతం రేవంత్ సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలో భాగమైన మెట్రో రెండో దశ ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ నుంచి ఎలాంటి సహకారం లభించని నేపథ్యంలో.. మెట్రో ప్రాజెక్టు నుంచి పంపేసే యోచన ప్రభుత్వం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు మెట్రోరెండో దశను ప్రభుత్వమే చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు.. మొదటి దశను కూడా టేకప్ చేస్తేనే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వం మదిలోఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తమకు అప్పులు.. వడ్డీల భారం ఎక్కువగా ఉందని ఎల్ అండ్ టీ చెబుతోంది. తొలి దశలో తమ సంస్థకు ఇచ్చిన ఆస్తుల నిర్వహణ సమర్థంగా లేదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. మరోవైపు మెట్రో నిర్వహణ తమకు లాభదాయకంగా లేదని ఎల్ అండ్ టీ సంస్థ అంతర్గతంగా లేఖలు రాస్తున్న వైనంపైనా ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
తరచూ బెదిరింపుధోరణితో ఎందుకు ఉండాలి? అన్న యోచనలోరేవంత్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మెట్రో రెండో దశ కింద మొదటి విడతలో రూ.24,259 కోట్లు.. మలి విడతలో రూ.19,450 కోట్లతో మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ.. మొదటి దశను కూడా ప్రభుత్వం కిందనే ఉంటే..అన్నీ ఒకే గొడుగున ఉండటంతో పాటు నిర్వహణ కూడా సులువు అవుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు నగర వ్యాప్తంగా మెట్రోతో విస్తరించాలని రేవంత్ సర్కారు పట్టుదలతో ఉంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
