సీఎం రేవంత్ ఆరోపణ.. కిషన్ రెడ్డి కౌంటర్ ఏంటి?
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయటమే కాదు.. రెండు రోజుల క్రితం మీడియా భేటీలో ఆయన తన ఫోకస్ మొత్తాన్ని హైదరాబాద్ మెట్రో మీదనే పెట్టటం తెలిసిందే.
By: Garuda Media | 17 Jun 2026 2:24 PM ISTహైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయటమే కాదు.. రెండు రోజుల క్రితం మీడియా భేటీలో ఆయన తన ఫోకస్ మొత్తాన్ని హైదరాబాద్ మెట్రో మీదనే పెట్టటం తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దెబ్బ తీస్తున్నట్లుగా సీఎం రేవంత సంచలన ఆరోపణ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంతకూ సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు ఏంటి? అందుకు కిషన్ రెడ్డి చేసిన కౌంటర్ వ్యాఖ్యలు ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ ఆరోపణ
జపాన్ సంస్థ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేసిన రూ.13,600 కోట్ల మెట్రో మొదటి దశ రీఫైనాన్స్ రుణాన్ని రాష్ట్రానికి అందకుండా కేంద్ర మంత్రులను కలిసి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
మెట్రో లోన్ ఆగిపోయిన విషయమే నాకు తెలీదు. ఒక కేంద్ర మంత్రి వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవు. సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి స్పష్టత లేకపోవడం వల్లే కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
సీఎం రేవంత్ ఆరోపణ
అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్, వైజాగ్ మెట్రోలకు నిధులు ఇస్తూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
దేశంలో మిగతా మెట్రోల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది. మొదటి దశ మెట్రోకు కేంద్రం రూ.1,250 కోట్లు ఇచ్చింది. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కూడా 50:50 నిష్పత్తిలో నిధులు సమకూర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.
సీఎం రేవంత్ ఆరోపణ
బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడానికి మెట్రో విస్తరణను తొక్కిపెడుతున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ అభివృద్ధిపై నాకు చిత్తశుద్ధి ఉంది. నేను చేస్తున్న పనులకు సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ
మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ ట సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,400 కోట్ల రుణ బదిలీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఇందుకోసం ₹84 కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించాం. ఈక్విటీ కింద రాష్ట్ర వాటాగా రూ.1,400 కోట్లు జమ చేశాం. ఈ రుణం 4% వడ్డీతో 20 ఏళ్ల కాలపరిమితితో ఒప్పందం కుదిరినా కేంద్రం అడ్డుకుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మాట్లాడా. ప్రతిపాదిత రుణ ఒప్పందానికి సంబంధించి సంబంధిత పక్షాల మధ్య ఇంకా పూర్తి స్పష్టత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి ఖట్టర్‌ను పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా ఐఆర్ఎఫ్ సీ ఒప్పందంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు.
సీఎం రేవంత్ ఆరోపణ
ఎల్ అండ్ టీ నుంచి మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
మెట్రో ద్వారా వచ్చే ఆదాయం నుంచి మెట్రో రోజువారీ నిర్వహణ మరియు సంరక్షణ ఖర్చులను పక్కన పెట్టకుండా, నేరుగా భారీ రుణాల చెల్లింపులకే వాడతామనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను కేంద్రం తప్పుబట్టింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నడపడానికి ముందుగా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, నిర్వహణ ఖర్చులపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సాంకేతిక సూచన చేసింది.
సీఎం రేవంత్ ఆరోపణ
కేంద్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ విస్తరణకు 50% భాగస్వామ్యం ఇవ్వడం కష్టంగా భావిస్తే, ఆ నిధులు మాకు వద్దు. కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇస్తే 100% సొంత ఖర్చులతోనే రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో విస్తరణ పూర్తి చేసుకుంటుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణను అడ్డుకోవట్లేదు. ఇప్పటికే నేను జనవరి 15న మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా. ఇలాంటి సాంకేతిక, ఆర్థిక మరియు రుణాల సమస్యలను ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం చేయడం కంటే.. నేనే స్వయంగా ముఖ్యమంత్రిని, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులను తీసుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్దకు వెళ్లి చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.
