Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో 5 గంటలకే ఎందుకు మొదలుకాదు?

హైదరాబాద్ మెట్రోరైలును ఉదయం ఆరు గంటలకు బదులుగా ఒక గంట ముందుగా అంటే ఐదు గంటలకు ఆరంభమయ్యేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది.

By:  Garuda Media   |   20 April 2026 12:00 PM IST
హైదరాబాద్ మెట్రో 5 గంటలకే ఎందుకు మొదలుకాదు?
X

హైదరాబాద్ మెట్రోరైలును ఉదయం ఆరు గంటలకు బదులుగా ఒక గంట ముందుగా అంటే ఐదు గంటలకు ఆరంభమయ్యేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందుకు తగినట్లే.. హైదరాబాద్ మెట్రో అథారిటీకి దక్షిణ మధ్య రైల్వే జీఎం ఒక లేఖ రాశారు. సికింద్రాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు.. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు వచ్చే ప్రధాన రైళ్లు ఉదయమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటాయి.

ఈ నేపథ్యంలో భారీగా హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులకు అనువుగా ఉండేలా మెట్రో రైళ్లను ఉదయం ఐదు గంటలకే మొదలయ్యేలా చేస్తే.. ఇటు సికింద్రాబాద్, అటు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు నగరంలోని తమ గమ్యస్థానాలకు సులువుగా వెళ్లే వీలుంటుంది. అదే సమయంలో ఉదయమే నడిచే రైళ్లకు చేరుకోవటానికి తేలిక అవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో నిత్యం భారీ సంఖ్యలో హైదరాబాద్ వస్తుంటారు.

అలా వచ్చే ప్రధాన రైళ్లు ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఏడు గంటల లోపు నగరానికి చేరుకుంటాయి. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి, ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు లాంటి నగరాలకు వందే భారత్.. రాజధాని.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల్లోపే బయలుదేరుతాయి. ఒకవేళ మెట్రో రైలు ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ అయితే.. నగర ప్రజలకు మరింత సులువుగా ఉంటుంది. మెట్రో రైలు లేక వేలాది మంది ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇదే సమస్యను ప్రస్తావిస్తూ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామక్రిష్ణారావుకు లేఖ రాశారు. అయితే.. నిర్వహణ కారణాలతో మెట్రో రైళ్లను ఉదయం ఐదు గంటలకు తీసుకురాలేమని ఎల్ అండ్ టీ - హెచ్ఎంఆర్ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నుంచి సమాధానం వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి నాగోల్, మియాపూర్, ఎల్ బీనగర్ నుంచి యలుదేరుతున్నాయి. దీంతో నాంపల్లి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు మొదటి మెట్రో రైలు వచ్చేసరికి ఉదయం ఆరున్నర గంటలవుతోంది.

ఎల్ అండ్ టీ కానీ హైదరాబాద్ మెట్రో రైలు అథారిటీ కానీ ఉదయం ఐదు గంటలకు మెట్రోను నడపటం సాధ్యం కాదని చెప్పటం తెలిసిందే. అయితే.. దేశంలో మెట్రో రైళ్లు నడుస్తున్న ప్రధాన నగరాల్ని చూస్తే.. బెంగళూరు, చెన్నై మహానగరాల్లోని మెట్రో ఉదయం 5 గంటలకే నడవటం కనిపిస్తుంది. ఇక.. ఢిల్లీ, ముంబయి మెట్రోలు ఉదయం 5.30 గంటలకు మొదలువుతున్నాయి. కోల్ కతాలో ఉదయం ఆరున్నర గంటలకు స్టార్ట్ అవుతోంది. రాత్రి వేళల్ని చూసినప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో రాత్రి పదకొండు గంటల వరకు నడిస్తే.. ముబయి.. ఢిల్లీ మెట్రోలు మాత్రం రాత్రిళ్లు 11.30 గంటలవరకు నడవటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఆపరేషనల్ ఖర్చుకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకుంటే..ఉదయం 5 గంటలకు తిరిగేలా చేయటం అసాధ్యమైతే కాదంటున్నారు.కాకుంటే.. ప్రభుత్వ చేయూత చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది. మరి.. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.