Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ మొసళ్ల మధ్య.. సినిమాను తలపించిన సన్నివేశం..

సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా–డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అటవీ అధికారి జమీల్, రెస్క్యూ టీం ఇన్‌ చార్జి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మీరాలం ట్యాంక్ వద్దకు చేరుకుంది.

By:  Tupaki Political Desk   |   26 Jan 2026 1:52 PM IST
అర్థరాత్రి వేళ మొసళ్ల మధ్య.. సినిమాను తలపించిన సన్నివేశం..
X

అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన నిజంగా సినిమాను మించిన ఉత్కంఠను సృష్టించింది. కటిక చీకట్లో, చుట్టూ మొసళ్లు ఉన్న నీటిమధ్య, దట్టంగా పెరిగిన కలుపు మొక్కల మధ్య చిక్కుకుపోయిన తొమ్మిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ప్రాణాలకు తెగించి సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ (హైడ్రా–డీఆర్ఎఫ్) సిబ్బంది ధైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు హైదరాబాద్ నగరానికి ఎంతో కీలకం. ఈ ట్యాంక్ పరిసర ప్రాంతాలను మరింత సురక్షితంగా, ఉపయోగకరంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా అక్కడ భారీ వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఆ వంతెన నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంజనీర్లు, కార్మికులతో కూడిన బృందం పడవలో సరస్సు మధ్యలోకి వెళ్లింది. మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో వారు చాలా లోతైన ప్రాంతానికి చేరుకున్నారు.

పనులు పూర్తిచేసుకొని సాయంత్రం తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో అనుకోని సమస్య ఎదురైంది. పడవ ఇంజిన్ పనిచేయడం మానేసింది. మొదట ఇది చిన్న సాంకేతిక సమస్యగా భావించినా, కొద్దిసేపటికే పరిస్థితి తీవ్రంగా మారింది. ఇంజిన్ మరమ్మతు చేయాలంటే తప్పనిసరిగా పడవ ఒడ్డుకు చేరాల్సిందేనని మెకానిక్ చెప్పడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. సరస్సు మధ్యలో దట్టంగా పెరిగిన కలుపు మొక్కలు పడవను చుట్టుముట్టాయి. చేతులతో నెట్టుకెళ్లే ప్రయత్నం చేసినా, కలుపు అడ్డుపడి పడవ కదలలేదు. అంతలోనే చీకటి ఆవరించింది. మీరాలం ట్యాంక్ ప్రాంతం ఇప్పటికే మొసళ్లకు ప్రసిద్ధి కావడంతో భయం రెట్టింపైంది. నీటిలో ఏ కదలిక కనిపించినా అది మొసలేనా? అన్న సందేహంతో కార్మికుల గుండెలు దడదడలాడాయి. గంటల తరబడి నీటి మధ్యలో చిక్కుకుపోవడంతో వారి పరిస్థితి నిస్సహాయంగా మారింది. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చివరకు వారు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి సహాయం కోరారు.

వేగంగా స్పందించిన హైడ్రా-డీఆర్ఎఫ్..

సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా–డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అటవీ అధికారి జమీల్, రెస్క్యూ టీం ఇన్‌ చార్జి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మీరాలం ట్యాంక్ వద్దకు చేరుకుంది. ముందుగా చిక్కుకున్న కార్మికులతో ఫోన్‌లో మాట్లాడి, భయపడవద్దని, కదలకుండా ఉండాలని సూచించారు. మొసళ్ల ముప్పు ఉన్న ప్రాంతం కావడంతో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కటిక చీకట్లో సరస్సు మధ్యలో ఉన్న పడవను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఎలాంటి శక్తివంతమైన లైట్లు లేకపోవడంతో టార్చీలు, మొబైల్ ఫోన్ లైట్లే ఆధారంగా మారాయి. నీటి మీద ప్రతిబింబించే చిన్న వెలుతురు ఆధారంగా వారి స్థానాన్ని గుర్తించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరకు పడవ ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు విడతలుగా చేపట్టారు.

విడతల వారీగా ఒడ్డుకు..

మొదటి విడతలో నలుగురు కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో కూడా చుట్టూ మొసళ్ల కదలికలు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తత మరింత పెరిగింది. ఆ తర్వాత రెండో విడతలో మిగిలిన ఐదుగురిని కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా బయటకు తీసుకువచ్చారు. గంటల తరబడి సాగిన ఈ ఆపరేషన్ చివరకు విజయవంతమవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో హైడ్రా బృందం ఎంత అప్రమత్తంగా, నిబద్ధతతో పనిచేస్తుందో మరోసారి నిరూపించింది. ప్రాణాపాయ స్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం ముందుకు వచ్చే ఈ సిబ్బందిపై నగరవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కటిక చీకట్లో, మొసళ్ల మధ్య సాగిన ఈ సాహసోపేత రక్షణ చర్య నిజంగా హైడ్రా ధైర్యసాహసాలకు చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.