ఈ దసరాకు హైదరాబాద్ లో ముక్క అమ్మరు బాస్
రోజులు గడుస్తున్నకొద్దీ.. మద్యం.. మాంసం వినియోగం అంతకంతకూ పెరుగుతున్నాయి.
By: Garuda Media | 30 Sept 2025 12:38 PM ISTరోజులు గడుస్తున్నకొద్దీ.. మద్యం.. మాంసం వినియోగం అంతకంతకూ పెరుగుతున్నాయి. గతంతో వారానికి ఒకసారి ముక్క అంటే అదో పండుగలా ఉండేది. ఇప్పుడు వారంలో ఎన్ని ఎక్కువసార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు ముక్క తినకుంటే ముద్ద దిగని పరిస్థితి. ఇలాంటి వేళ.. దసరా లాంటి పెద్ద పండుగ వేళ.. ముక్క లేని పరిస్థితికి మించిన నరకం ఇంకేం ఉంటుంది. కానీ.. ఈ దసరాకు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ‘ముక్క’ అమ్మకాలపై పరిమితులు విధిస్తూ.. షాపులు తెరవకూడదన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
పండుగ వేళ.. అది దసరా రోజున ముక్క లేకుండా ఉండటమా? అని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. కానీ.. ఈసారి దసరా గురువారం అంటే.. అక్టోబరు 2న వచ్చింది. ఈ రోజుకు ఉన్న మరో ప్రత్యేకత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కూడా. ఈ నేపథ్యంలో మద్యం.. మాంసం ప్రియుల ఉత్సాహానికి బ్రేకులు వేసేలా.. ఆ రోజు మాంసం అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది జీహెచ్ఎంసీ.
దీంతో అక్టోబరు 2న ఎద్దులు.. గొర్రెలు.. మేకల వధుశాలలు.. అలాగే రిటైల్ మాంసం.. బీఫ్ దుకాణాల్నిమూసి వేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని విభాగం 533(బి) ప్రకారం ఈ నెల 24న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన దాని ప్రకారం ముక్క అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ సోమవారం జీహెచ్ఎంసీ ఆదేశాల్ని జారీ చేసింది. దీనికి అధికారులంతా సహకరించాలని.. మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రను కాపాడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సో.. ముక్క విషయంలో.. అందునా పండుగ రోజున పక్కాగా తినాల్సిందేనని డిసైడ్ అయ్యేటోళ్లు.. ముందస్తు ప్లానింగ్ చేసుకోవటం చాలా అవసరం. బీ అలెర్టు సుమి.
