మృత్యుంజయుడు షోయబ్ చెప్పిన షాకింగ్ విషయాలు..!
శరీరానికి అయిన గాయాలతో పాటు మనసుకు అయిన గాయంతో సౌదీ అరేబియా నుండి ఇటీవలే ఇండియాకు వచ్చిన ఆ మృత్యుంజయుడు షోయబ్.
By: Ramesh Palla | 5 Dec 2025 3:33 PM ISTముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే యాత్రల్లో మక్కా యాత్ర ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు ముస్లింలు పోటెత్తుతారు. ఇండియా నుంచి కూడా లక్షలాది మంది వెళ్లడం మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున అక్కడకు వెళ్తారు. హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన వేలాది మది ప్రతి ఏడాది ఆ పవిత్ర స్థల సందర్శనకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదు నుండి ట్రావెల్ ఏజెన్సీల ద్వారా పెద్ద ఎత్తున ముస్లింలు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిలో మెజారిటీ ముస్లింలు తిరిగివచ్చారు. కానీ 45 మంది మాత్రం సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్కు చెందిన వారే కావడం విశేషం. అయితే అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే మొత్తం బస్సులో ఉన్నవారిలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడుగా బతికి బట్ట కట్టాడు.
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం
శరీరానికి అయిన గాయాలతో పాటు మనసుకు అయిన గాయంతో సౌదీ అరేబియా నుండి ఇటీవలే ఇండియాకు వచ్చిన ఆ మృత్యుంజయుడు షోయబ్. ఇప్పటికీ అతడు కాలిన గాయాలకు చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో అతడు తృటిలో తప్పించుకున్నాడు. క్షణం ఆలస్యం అయితే అతడు కూడా అగ్నికి ఆహుతి అయ్యేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన కాలిన గాయాలను చూపిస్తూ, తన వారిని కోల్పోయిన బాధతో అతడు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని ద్రవింప చేసేదిగా ఉన్నాయి. అతడు మానసికంగా కూడా చాలా కృంగిపోయినట్లు మాట్లాడుతున్నాడు. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్ ముందు వరకు చాలా సంతోషంగా దేవుడిని చూస్తామన్న ఆనందంతో ఉన్నారు. కొందరు నిద్రలో ఉండగా మరికొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి టాయిలెట్ అని చెప్పి బస్సు ఆపించాడు.
ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన ట్యాంకర్
ఆగి ఉన్న మా బస్సు వెనుక నుండి ఏదో వాహనం బలంగా ఢీ కొట్టినట్లు అనిపించింది. వెంటనే మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు నేను డ్రైవర్ వెనుక నిలబడి ఉన్నాను. వెంటనే నేను అత్యవసర ద్వారం నుండి దూకేశాను. అప్పటికే నా డ్రెస్ కి మంటలు అంటుకున్నాయి, వాటిని ఆర్పేందుకు ప్రయత్నించకుండా డ్రెస్ మొత్తం విప్పేశాను. దూకే సమయంలో నాకు గాయం అయింది. వాటన్నింటిని పట్టించుకోకుండా బస్సుకి దూరంగా పరిగెత్తాను. కొన్ని నిమిషాల తర్వాత నాకు మొత్తం పరిస్థితి అర్థం అయింది. బస్సులో ఉన్నవారు ఏ ఒక్కరూ బ్రతికే అవకాశం లేదని ధ్రువీకరించుకున్నాను. మా బస్సుని ఢీ కొట్టింది ఒక ఆయిల్ ట్యాంకర్ అని నాకు అప్పుడే అర్థమైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, పోలీస్ సిబ్బంది నన్ను స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తర్వాత రోజుల్లో వారు నా వద్దకు వచ్చి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. నా చేతి వేలిముద్రలు తీసుకున్నారు. నా యొక్క చికిత్సకు సంబంధించి పూర్తి సహకారాన్ని వారు అందించారు.
బస్సు ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి
ఆ అల్లా దయతో నేను ఈరోజు బతికి బయటపడ్డాను అని మృత్యుంజయుడు అయిన షోయబ్ చెప్పుకొచ్చాడు. చూస్తుండగానే మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వారు ఆహాకారాలు పెడుతూ కొన్ని నిమిషాలకు సైలెంట్ అయ్యారు. వారి ఆహాకారాలు ఇప్పటికీ నా మైండ్లో వినిపిస్తూనే ఉన్నాయి. అత్యంత దయనీయ పరిస్థితుల్లో నేను అక్కడినుండి బయటపడ్డాను. డ్రైవర్ పక్కన ఉన్న కారణంగానే నేను బయటపడగలిగాను, అందరిలాగా కూర్చుని ఉంటే ఖచ్చితంగా అగ్నికి ఆహుతి అయ్యేవాడిని అని ఆయన చెప్పుకొచ్చాడు. స్థానిక ప్రభుత్వం తనకు కావలసిన ఏర్పాట్లు చేయడంతో పాటు తిరిగి హైదరాబాద్ చేరుకోవడానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందించిందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహాయం చేశారని మృత్యుంజయుడు షోయబ్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మళ్లీ సౌదీ వెళ్ళే ఆలోచన చేస్తారా అన్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చెప్పడం విశేషం.
