డిజిటల్ పేమెంట్లలో మోసాల వెల్లువ: ఆర్బీఐ సరికొత్త మార్గదర్శకాలు!
హైదరాబాద్‌కు చెందిన అలోక్ (పేరు మార్చబడింది) అనే బిజినెస్ అనలిస్ట్.. ట్రాఫిక్ ఫైన్ కట్టాలంటూ వచ్చిన ఒక ఫేక్ మెసేజ్‌ను నమ్మి తన క్రెడిట్ కార్డు నుండి నిమిషాల వ్యవధిలో దాదాపు 3,225 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) కోల్పోయాడు.
By: Sivaji Kontham | 2 May 2026 1:00 AM ISTహైదరాబాద్‌కు చెందిన అలోక్ (పేరు మార్చబడింది) అనే బిజినెస్ అనలిస్ట్.. ట్రాఫిక్ ఫైన్ కట్టాలంటూ వచ్చిన ఒక ఫేక్ మెసేజ్‌ను నమ్మి తన క్రెడిట్ కార్డు నుండి నిమిషాల వ్యవధిలో దాదాపు 3,225 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) కోల్పోయాడు. కేవలం వెయ్యి రూపాయల జరిమానా కట్టబోయి మోసగాళ్లు పంపిన ఫిషింగ్ లింక్ క్లిక్ చేయడం వల్ల తన ఖాతా మొత్తం ఖాళీ అయ్యింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన కొద్దీ.. ఇలాంటి `సోషల్ ఇంజనీరింగ్` మోసాలు పెట్రేగుతున్నాయి. బాధితులను భయపెట్టి కంగారు పెట్టి డబ్బులు కొట్టేస్తున్నారు.
గత ఐదేళ్లలో దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఇలాంటి సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం... 2025లో సుమారు 25 లక్షల మంది ప్రజలు దాదాపు 23,725 కోట్లు (2.5 బిలియన్ల డాలర్ల) సొమ్మును కోల్పోయారు. ఇది 2021తో పోలిస్తే 4300 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ తీవ్రతను గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి కీలకమైన చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో మోసాలను అరికట్టేందుకు పలు కఠిన చర్యలను ప్రతిపాదించింది.
ఆర్బీఐ ప్రతిపాదించిన ప్రధాన మార్పులలో `వన్ అవర్ ల్యాగ్` (ఒక గంట జాప్యం) ఒకటి. దీని ప్రకారం.. ఒక ఖాతా నుండి మరో ఖాతాకు డబ్బులు పంపినప్పుడు.. ఆ లావాదేవీ పూర్తి కావడానికి ఒక గంట సమయం పడుతుంది. దీనివల్ల పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బులు పంపినప్పుడు వాటిని ఆపే అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధులు వంటి సులభంగా మోసపోయే వర్గాల కోసం `ట్రస్టెడ్ పర్సన్` (నమ్మకస్తుడైన వ్యక్తి) ద్వారా అదనపు ధృవీకరణ ఉండాలని కూడా ఆర్బీఐ యోచిస్తోంది. దీనితో పాటు కార్డుల మాదిరిగానే డిజిటల్ పేమెంట్లను ఆన్/ఆఫ్ చేసుకునే సదుపాయం, పరిమితులు విధించుకునే అవకాశం కల్పించనున్నారు.
అయితే ఈ ప్రతిపాదనలపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. చెల్లింపులలో గంట సేపు జాప్యం చేయడం వల్ల మోసాలు తగ్గే అవకాశం ఉన్నా కానీ.. ఇది డిజిటల్ పేమెంట్ల ప్రధాన లక్ష్యమైన `తక్షణ చెల్లింపు` విధానానికి విరుద్ధంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించి ప్రతి కొన్ని కిలోమీటర్లకు స్పీడ్ బ్రేకర్లు వేసినట్లు ఉంటుంది అని ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ మాజీ సీఈఓ రాజేష్ భన్సల్ వ్యాఖ్యానించారు. మోసగాళ్లు ఈ గంట సమయాన్ని కూడా అధిగమించేలా కొత్త పద్ధతులను కనిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు.. ఇలాంటి నిబంధనలను అమలు చేయడం సాంకేతికంగా కూడా సవాలుతో కూడుకున్నది. పేమెంట్ నెట్‌వర్క్‌లో అనేక సంస్థలు భాగస్వామ్యమై ఉండటంతో ప్రస్తుత వ్యవస్థను మార్చడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ అదనపు వ్యయం చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉంది. అలాగే `మ్యూల్ అకౌంట్స్` (అక్రమ లావాదేవీలకు వాడే ఖాతాలు) గుర్తింపును మరింత పటిష్టం చేయాలని.. ఇందుకోసం ఇప్పటికే ఉన్న టెక్నాలజీని వేగంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం నిబంధనలు మాత్రమే మోసాలను ఆపలేవని.. ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికత పెరిగిన వేగంతో పోలిస్తే.. దానిపై అవగాహన పెరగడం లేదని... దీనివల్ల ముఖ్యంగా వృద్ధులు సులభంగా మోసపోతున్నారని పేర్కొంటున్నారు. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లతో ప్రచారం చేస్తున్నా.. మరింత లోతైన అవగాహన కార్యక్రమాలు అవసరమని పోలీసులు - ఇతర శాఖలతో ఆర్బీఐ సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.
