లోన్ యాప్ కిల్లర్స్: సామాన్యుల ప్రాణాలతో చెలగాటం.. హైదరాబాద్ యువకుడి మృతితో కలకలం!
లోన్ యాప్ ప్రతినిధుల నుంచి వస్తున్న బెదిరింపులతో ప్రేమ్ కుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.
By: Madhu Reddy | 4 Feb 2026 6:56 PM ISTటెక్నాలజీ సాయంతో చిటికెలో అప్పు ఇస్తామంటూ ఊరిస్తున్న లోన్ యాప్‌లు ఇప్పుడు ప్రాణాలు తీసే కిల్లర్లలా మారుతున్నాయి. హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు కేవలం మూడు వేల రూపాయల కోసం ఈ యాప్‌ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. సులభంగా లోన్ వస్తుందని మనం చేసే ఒక చిన్న పొరపాటు, జీవితాలనే ఎలా చిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి ఈ విషాదమే నిదర్శనం.
మూడు వేల రూపాయల అప్పు.. ముగిసిన నిండు ప్రాణం:
హైదరాబాద్ రాంనగర్‌లో నివసించే ప్రేమ్ కుమార్ (36) తన అవసరాల నిమిత్తం ఒక లోన్ యాప్ ద్వారా కేవలం రూ. 3,000 అప్పు తీసుకున్నాడు. అయితే, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో యాప్ నిర్వాహకుల ఆగడాలు మొదలయ్యాయి. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్ లిస్టును హ్యాక్ చేసి, అతని బందువులకు,కాంటాక్ట్ లిస్ట్ లో వున్నా అందరికి అతని న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ కిరాతకంగా బెదిరించారు. కేవలం మూడు వేల రూపాయల కోసం ఒక మనిషి గౌరవాన్ని బజారున పెడతామని హెచ్చరించడం లోన్ యాప్ నిర్వాహకుల క్రూరత్వానికి పరాకాష్ట.
అవమానం భరించలేక ఆత్మహత్య:
లోన్ యాప్ ప్రతినిధుల నుంచి వస్తున్న బెదిరింపులతో ప్రేమ్ కుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. పరువు పోతుందన్న భయంతో, ఆ ఫొటోస్ వాళ్ళు బందువులకు అందరికి పంపిస్తారని భయపడి ఆ అవమానం భరించలేక తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క చిన్న లోన్ కారణంగా ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ద్వారా సామాన్యులను లోన్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో మరోసారి బట్టబయలైంది.
ప్రజలారా అప్రమత్తం.. ఆ మాయలో పడకండి:
ప్లే స్టోర్‌లో దొరికే అనధికారిక లోన్ యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తక్కువ వడ్డీ, తక్షణమే డబ్బు అంటూ వచ్చే ప్రకటనలను నమ్మి మీ ఫోన్ గ్యాలరీ, కాంటాక్ట్స్ పర్మిషన్లు ఇవ్వకండి. ఒక్కసారి డేటా వారి చేతికి చిక్కితే, మీ గౌరవంతో వారు చెలగాటం ఆడుతారు. వేధింపులు ఎదురైతే భయపడి ఆత్మహత్యలకు పాల్పడకుండా, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు (1930 నెంబర్ కు) ఫిర్యాదు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి డెత్ యాప్‌లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే వాదన వినిపిస్తుంది.
ప్రాణం కంటే పరువు, డబ్బు ఏదీ ఎక్కువ కాదు. ఆపదలో ఉన్నప్పుడు లోన్ యాప్‌ల కంటే నమ్మకమైన వ్యక్తులను లేదా బ్యాంకులను ఆశ్రయించడం మేలు. ప్రేమ్ కుమార్ మృతి లోన్ యాప్ బాధితులందరికీ ఒక హెచ్చరికగా నిలవాలి.
