తెలంగాణలో.. విమోచన దినం వర్సెస్ ప్రజాపాలన!
ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్ విముక్తి కోసం ఎందరో యోధులు పోరాడారని.. వారికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
By: Garuda Media | 17 Sept 2026 10:52 PM ISTతెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను నిజాం పాలన నుంచి విముక్తి కలిగించిన రోజును పురస్కరించుకుని గురువారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా కిషన్ రెడ్డి వంటి కీలకనాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రాంతం దేశంలో అంతర్భాగం కావడానికి ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను బలిదానం చేశారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వారి బలిదానం వృథా కాలేదన్నారు.
ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్ విముక్తి కోసం ఎందరో యోధులు పోరాడారని.. వారికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వారి పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఇక, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి హైదరాబాద్ విమోచన దినోత్సవం ప్రతీక అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు కేవలం క్యాలెండర్‌లోని ఒక తేదీ మాత్రమే కాదని, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది మంది తమ రక్తాన్ని చిందించిన చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు.
రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడి, తమ ప్రాణాలతో స్వేచ్ఛా జ్యోతిని వెలిగించిన దొడ్డి కొమరయ్య, చాకలి ఆలమ్మ, కొమరం భీమ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు తాను భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నని కేంద్ర మంత్రి తెలిపారు. 'ఆపరేషన్ పోలో' ద్వారా నిజాం అణచివేత నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించి, జాతీయ ఐక్యతను కాపాడుతూ దానిని భారత యూనియన్‌లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అచంచల మైన సంకల్పం శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
నిజాం పాలనపై ప్రశంసలు..
సీఎం రేవంత్ రెడ్డి కూడా నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభు త్వం తరఫున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మల నుంచి అన్యాయంపై పోరాడిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్నారు. సెప్టెంబరు 17కు చరిత్రలో ప్రత్యేక స్థానముందన్న సీఎం.. నిజాం పాలనలో హైదరాబాద్ అభివృద్ది చెందిందని తెలిపారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అరాచకం రాజ్యమేలింద న్నారు. ఇదే భారతదేశంలో విలీనం కావాలన్న బలమైన ఆకాంక్షకు బీజం పడేలా చేసిందన్నారు.
