Begin typing your search above and press return to search.

ఒక్క వానకే హైదరాబాద్ చెరువుల కళకళ.. హైడ్రా శ్రమకు దక్కిన సార్థకత..

ఒకప్పుడు మురుగుతో నిండి.. కబ్జాల కోరల్లో చిక్కుకుని ఉపిరిసలుపుకోని ఆ చెరువులు.. నేడు హైడ్రా సంకల్ప బలం.. ఒకే ఒక్క వాన ధాటికి సరికొత్త జీవనాన్ని సంతరించుకున్నాయి.

By:  A.N.Kumar   |   30 Oct 2026 10:41 PM IST
ఒక్క వానకే హైదరాబాద్ చెరువుల కళకళ.. హైడ్రా శ్రమకు దక్కిన సార్థకత..
X

ఒకప్పుడు మురుగుతో నిండి.. కబ్జాల కోరల్లో చిక్కుకుని ఉపిరిసలుపుకోని ఆ చెరువులు.. నేడు హైడ్రా సంకల్ప బలం.. ఒకే ఒక్క వాన ధాటికి సరికొత్త జీవనాన్ని సంతరించుకున్నాయి. ఎండిపోయిన జాడ నుంచి స్వచ్ఛమైన జలకళతో తొణికిసలాడుతూ నగర ప్రజల దాహార్తిని తీర్చే అమృత ధారలుగా మారుతున్న ఆ జలాశయాల విజయగాథే ఈ నేటి చారిత్రక పరిణామం.

ఎల్‌నినో ప్రభావంతో వాన చినుకు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగర ప్రజలకు వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. శుక్రవారం కురిసిన సుమారు 7 సెంటీమీటర్లు భారీ వర్షం హైదరాబాద్ వాసుల మోములపై చిరునవ్వులు పూయించింది. ముఖ్యంగా మాదాపూర్‌లోని సున్నం చెరువు , తమ్మిడికుంట జలాశయాలు వర్షపు నీటితో కళకళలాడుతుండటం స్థానికుల్లో అమితానందాన్ని నింపుతోంది.

ఒకప్పుడు ఈ చెరువుల పరిస్థితి చూస్తే కన్నీళ్లే మిగిలేవి. మురుగు నీరు.. భారీగా పేరుకుపోయిన పూడిక.. కబ్జాల కోరల్లో చిక్కుకుని ఆ చెరువులు దుర్గంధం వెదజల్లాయి. నీటి జాడ లేక ఎండిపోయి వెలవెలబోయిన ఆ జలాశయాలను చూసి స్థానికులు ఆవేదన చెందేవారు. కానీ నేడు ఆ దృశ్యాలు పూర్తిగా మారిపోయాయి.

నగరంలోని చెరువులను కాపాడేందుకు ‘హైడ్రా’ చేపట్టిన సంకల్పం ఇప్పడు సత్ఫలితాలను ఇస్తోంది. సున్నం చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన 10 నుంచి 15 అడుగుల పూడికను హైడ్రా తొలగించింది. ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు.. చుట్టూ వాకింగ్ పాత్‌వేలు, పిల్లల కోసం ఆటస్థలాలు, పూలు, మొక్కలతో ఆ ప్రాంతాన్ని ఒక సుందరమైన పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దింది.

అయితే చెరువులను అందంగా చేయడం ఎంత ముఖ్యమో.. వాటిలోకి వర్షపు నీరు చేరేలా చేయడం అంతకంటే ముఖ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు.. రోడ్లపై వృథాగా పారే వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరేలా ప్రత్యేకంగా 'ఇన్‌లెట్లను' ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ఇన్‌లెట్లు ఆ ప్రాంతానికి జీవనాధారంగా మారాయి.

శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ప్రవహించాల్సిన నీరంతా నేరుగా సున్నం చెరువులోకి పరుగులు పెట్టింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తమ కళ్ల ముందే చెరువు నీటితో నిండుతుండటం చూసి పరవశించిపోయారు. కొందరైతే ఈ ఆనంద క్షమాలను వీడియోలు తీసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పంపి తమ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ చెరువులు, ప్రారంభోత్సవానికి ముందే జలకళ సంతరించుకోవడం శుభపరిణామమని స్థానికులు ఉప్పొంగిపోతున్నారు.

ఈ వర్షపు నీరు చెరువులో నిలవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు.. వేలాది మందికి తాగునీటి భద్రత చేకూరుతుంది. ఎండిపోయిన బోర్లు మళ్లీ ఊపిరి పీల్చుకుంటాయని.. భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

"చెరువులు బతికితేనే నగరానికి భవిష్యత్తు" అనే నినాదానికి హైడ్రా చేపట్టిన ఈ పునరుద్ధరణ పనులు నిజ రూపం ఇస్తున్నాయి. మురుగు కూపాలుగా ఉన్న జలాశయాలు స్వచ్ఛమైన వర్షపు జలాలతో కళకళలాడుతుంటే.. హైదరాబాద్ భవిష్యత్తుపై భరోసా కలుగుతోంది. సున్నం చెరువులో మొదలైన ఈ జలకళ ఇలాగే కొనసాగి నగరంలోని ప్రతీ చెరువుకు జీవం పోయాలని మనసారా కోరుకుందాం..