జూబ్లీహిల్స్ పోరు.. సర్వేలున్నా.. శిబిరాల్లో ఉత్కంఠే!
కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే.. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశించిన వారు.. అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఆశించిన వారు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కీలకంగా భావిస్తున్నారు.
By: Garuda Media | 3 Nov 2025 3:00 PM ISTహైదరాబాద్‌లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం.. జూబ్లీహిల్స్. మరో వారం రోజుల్లో(నవంబరు 11) ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. ప్రస్తుతం బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు గెలుపు గుర్రంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం.. ప్రత్యర్థుల ఎత్తులపై చర్చలు చేస్తున్నారు. వారికన్నా మెరుగ్గా ప్రచారం చేస్తున్నామా? లేదా? ఏయే అంశాలను ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తున్నాయి.
అంతేకాదు.. ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని కూడా కొలుచుకుంటున్నాయి. ఏయే అంశాలను ప్రస్తా వించాం.. ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటి? అనే విషయాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా అటు బీఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్ శిబిరాలు.. సర్వేలను ఆధారం చేసుకుని.. తమదే గెలుపు అంటూ ప్రచా రం చేసుకోవడం ఒక అంశం. మరొకటి.. ఈ ఉప పోరు విజయం ఆధారంగా.. తమ తమ పార్టీ నాయకులకు పదవులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే.. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశించిన వారు.. అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఆశించిన వారు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కీలకంగా భావిస్తున్నారు. ఇక్కడ తమ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం ద్వారా.. అధిష్టానం కనుసన్నల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఆశించేవారు.. రాష్ట్రస్థాయి నాయకత్వం మెప్పుకోసం పనిచేస్తున్నారు. మొత్తంగా.. ఒక ఎమ్మెల్యే సీటును కైవసంచేసుకుంటే.. తమకు కూడా పదవులు లభిస్తాయని మెజారి టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు.
ఇక, బీఆర్ ఎస్‌లోనూ ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. పార్టీ పదవుల కోసం.. పెద్ద ఎత్తున ఆశిస్తున్న వారు.. వచ్చే ఎన్నికల నాటికి టికెట్లు ఆశిస్తున్నవారు.. ఇప్పటికే కేసీఆర్ దగ్గర మంచి మార్కులు ఉన్నవారు.. ఆమార్కులు కాపాడుకునేందుకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆలంబనగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మరింత తీవ్రంగా పోరు సాగుతోంది. మరోవైపు.. ఇప్పటికేకొన్ని సర్వేలు కూడా వెలుగు చూశాయి.
అయితే.. వీటిలో తమకు అనుకూలంగా ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు.. మరింత దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇరు శిబిరాల మధ్య పోరు సాగనుందని.. దాదాపు సగటు ఓటరుకు అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య ఉత్కంఠ మరింత పెరిగింది.
