హిజ్రాలు కాదు మగాళ్లే.. బీఎండబ్ల్యూ కార్ ఓనర్ నుంచి రూ.5వేలు వసూలు.. ఎట్టకేలకు అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలు.. ప్రధాన రహదారులపై వాహనదారులను.. సాధారణ ప్రజలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాల పట్ల హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
By: A.N.Kumar | 3 Oct 2026 3:34 PM ISTహైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలు.. ప్రధాన రహదారులపై వాహనదారులను.. సాధారణ ప్రజలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాల పట్ల హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ వంటి విఐపి ప్రాంతంలో ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అడ్డగించి దౌర్జన్యంగా రూ. 5,000 వసూలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా ట్రాన్స్‌జెండర్ల వేషధారణలో ఉన్న నలుగురు పురుషులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.
వైరల్ వీడియోతో బయటపడ్డ ముఠా గుట్టు
కారు యజమానిని అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తీవ్రంగా వైరల్ కావడంతో పాటు ప్రజల నుంచి భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విజువల్స్ ఆధారంగా తక్షణమే స్పందించిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలోని సిసిటివి ఫుటేజ్, వైరల్ వీడియోను విశ్లేషించి కారును అడ్డుకున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ట్రాన్స్‌జెండర్లు కాదు.. మగాళ్లే
పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులు అసలైన ట్రాన్స్‌జెండర్లు కారని.. కేవలం సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో మహిళల మాదిరిగా చీరలు, మేకప్ ధరించి రోడ్డుపైకి వస్తున్న పురుషులని తేలింది. హిజ్రాల వేషధారణలో ఉంటే ప్రజలు భయపడి లేదా సంకోచించి అడిగినంత డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతోనే వీరు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారు.
నగరంలో పెరుగుతున్న అక్రమ వసూళ్ల వేధింపులు
గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్స్, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు గృహప్రవేశాలు, శుభకార్యాల వద్ద కొందరు వ్యక్తులు మితిమీరిన రీతిలో ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఒక గృహప్రవేశ వేడుక వద్ద ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50,000 వరకు డిమాండ్ చేసిన ఘటన కూడా స్థానికంగా కలకలం రేపింది. ఇవ్వడానికి నిరాకరిస్తే వాహనాలను అడ్డుకోవడం.. వాహనదారులపై వికృత చేష్టలకు పాల్పడడం వంటి ఘటనలతో నగరవాసులు తీవ్ర నిరాశ, అసహనానికి గురవుతున్నారు.
చట్టబద్ధమైన చర్యలు తప్పవు.. పోలీసుల హెచ్చరిక
ఈ సంచలన అరెస్టుపై స్పందించిన నగర పోలీసులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను లేదా వాహనదారులను భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తే ఎంతటి వారికైనా కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. అదే సమయంలో చట్టాన్ని అతిక్రమించే కొందరు అసాంఘిక శక్తుల వల్ల మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి చెడ్డపేరు రాకూడదని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా చట్టవిరుద్ధ వసూళ్లకు పాల్పడే ట్రాన్స్ జెండర్లు, ఇరుతు ఎవరిపైనా అయినా కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
