Begin typing your search above and press return to search.

#ViralNews - ఇదేందయ్యా ఇదీ.. స్కిల్డ్ దొంగ.. ఉద్యోగం ఇస్తే ల్యాప్‌టాప్‌తో జంప్..

కోడింగ్, డెవలప్‌మెంట్‌లో టాలెంట్ ఉందో లేదో పక్కన పెడితే.. ఉద్యోగం కొట్టడం.. కంపెనీకి టోకరా కొట్టడంలో మాత్రం ఇతగాడు 'ఆస్కార్' లెవెల్ ప్రతిభను కనబరిచాడు.

By:  A.N.Kumar   |   3 Jun 2026 11:41 AM IST
#ViralNews - ఇదేందయ్యా ఇదీ.. స్కిల్డ్ దొంగ.. ఉద్యోగం ఇస్తే ల్యాప్‌టాప్‌తో జంప్..
X

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజూ ఎన్నో రకాల ఇంటర్వ్యూలు, నియామకాలు జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య ఓ యువకుడు చేసిన "ప్రాజెక్ట్" చూస్తే.. సాఫ్ట్‌వేర్ కంపెనీల హెచ్‌ఆర్ ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. కోడింగ్, డెవలప్‌మెంట్‌లో టాలెంట్ ఉందో లేదో పక్కన పెడితే.. ఉద్యోగం కొట్టడం.. కంపెనీకి టోకరా కొట్టడంలో మాత్రం ఇతగాడు 'ఆస్కార్' లెవెల్ ప్రతిభను కనబరిచాడు. కంపెనీ ఇచ్చిన బ్రాండ్ న్యూ ఆపిల్ కంపెనీ మ్యాక్‌బుక్‌తో జంప్ అయి ఐటీ ఇండస్ట్రీకి కొత్త షాక్ ఇచ్చాడు ఈ "స్కిల్డ్ దొంగ".

ఇంటర్వ్యూ రౌండ్లు క్లియర్.. హెచ్‌ఆర్‌లు ఫిదా!

కథలోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ లో ఉద్యోగం కోసం ఓ ఘనుడు అప్లై చేశాడు. సాధారణంగా ఇలాంటి పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూ అంటేనే అభ్యర్థులు వణికిపోతారు. కానీ మనోడు మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. ఒక్కటి కాదు.. రెండు కాదు, కంపెనీ పెట్టిన అన్ని రౌండ్లనూ 'వెన్నెతో పెట్టిన విద్య'లా క్లియర్ చేసేశాడు. అతని కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ చూసి రిక్రూటర్లు కూడా మురిసిపోయారు. "ఆహా.. మా కంపెనీకి దొరికిన కోహినూర్ వజ్రం ఇతనే!" అని భావించి వెంటనే చేతిలో ఆఫర్ లెటర్ పెట్టేశారు.

అసలు ట్విస్ట్.. మ్యాక్‌బుక్ రాక.. మొహం చాటేశాక!

కంపెనీ పాలసీ ప్రకారం.. ఆన్‌బోర్డింగ్‌కు ముందే కొత్త ఉద్యోగి ఇంటి అడ్రస్‌కు ఒక ఖరీదైన 'మ్యాక్‌బుక్'ను కొరియర్ చేశారు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగిసింది. సెకండ్ హాఫ్‌లోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ల్యాప్‌టాప్ డెలివరీ అయిన మరుసటి క్షణం నుంచే ఆ యువకుడు 'మిస్టర్ ఇండియా'లా మాయమైపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. మెయిల్స్ పంపితే నో రిప్లై.. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ చూస్తే అడ్రస్ లేదు డిలీట్ చేసేశాడు.. కంగారుపడిన కంపెనీ ప్రతినిధులు అతను ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లి చూస్తే.. అక్కడ ఇల్లు ఖాళీగా ఉంది. అంతటితో ఆగకుండా, కంపెనీ వాళ్లు ట్రాక్ చేయకుండా ఉండటం కోసం ఆ మ్యాక్‌బుక్‌ను 'ఫ్యాక్టరీ రీసెట్' కూడా చేసేశాడు. అంటే ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నెటిజన్ల సెటైర్లు "వీడికి కన్సల్టెంట్ పోస్టు ఇవ్వాలి బాస్!

ఈ విచిత్రమైన మోసం గురించి ఓ రిక్రూటర్ లింక్డ్‌ఇన్ లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ సెటైర్లు విసురుతున్నారు. "ఇది సాధారణ మోసం కాదు బాస్.. పక్కా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్‌మెంట్‌తో కూడిన ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఆపరేషన్!" అని ఒకరు కామెంట్ చేయగా.. "అబ్బాయి టాలెంట్ మామూలుగా లేదు.. ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు కానీ అతని ప్లానింగ్ స్కిల్స్ చూసి కంపెనీకి కన్సల్టెంట్ పోస్ట్ ఇవ్వొచ్చు" అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు.

అయితే ఇంకొందరు మాత్రం సీరియస్‌గానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "నయం.. ల్యాప్‌టాప్‌తోనే పోయింది. ఒకవేళ కంపెనీ డేటా యాక్సెస్ ఇచ్చాక ఇలా చేసి ఉంటే పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో 'స్కిల్డ్ కాండిడేట్స్' దొరకడం కష్టంగా ఉందంటూ ఐటీ కంపెనీలు బాధపడుతుంటాయి. కానీ, ఈ ఘటన చూశాక.. మార్కెట్‌లో స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కంటే ఇలాంటి 'స్కిల్డ్ దొంగలకే' ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా.. ఇకపై అభ్యర్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చే ముందు హెచ్‌ఆర్‌లు వంద సార్లు ఆలోచించడం ఖాయం!