Begin typing your search above and press return to search.

మోనోరైలు.. హైదరాబాద్ ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారమా?

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతాలు హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కుందన్‌బాగ్–కోఠగూడ జంక్షన్ – ఉదయం , సాయంత్రం పీక్ అవర్స్‌లో రద్దీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

By:  A.N.Kumar   |   13 Nov 2025 1:00 PM IST
మోనోరైలు.. హైదరాబాద్ ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారమా?
X

హైదరాబాద్‌ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు ఐటీ రంగంలో ప్రపంచ పటంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుండగా మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు పెనుసమస్యగా మారుతోంది. ఈ సంక్లిష్ట పరిస్థితికి శాశ్వత పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, ఆధునిక రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే ఐటీ కారిడార్‌లో మోనోరైలు.. స్కైవాక్‌ల కలయిక.

* ట్రాఫిక్ కష్టాలు: ఐటీ కారిడార్‌లోని పీడకల

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతాలు హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కుందన్‌బాగ్–కోఠగూడ జంక్షన్ – ఉదయం , సాయంత్రం పీక్ అవర్స్‌లో రద్దీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ప్రతిరోజూ భారీ ట్రాఫిక్‌తో సతమతమవుతున్నారు. కొన్ని సర్క్యూట్లలో ఏకంగా ఒకటి లేదా రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లు సాధారణమైపోయాయి. విలువైన పని సమయం రోడ్లపైనే గడిచిపోవడంతో, ఇది కేవలం ట్రాఫిక్ సమస్యగా కాకుండా, ఉత్పాదకతపై, మానసిక ఒత్తిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేయడంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

*స్కైవాక్‌లు – మోనోరైల్‌ కలయికతో సరికొత్త రవాణా వ్యవస్థ

ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఒక రవాణా మార్గాన్ని మాత్రమే కాకుండా ఒక సంపూర్ణమైన రవాణా వ్యవస్థను రూపొందించే దిశగా ఆలోచిస్తోంది. రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కలిసి స్కైవాక్‌ల ద్వారా ఐటీ కారిడార్‌ను అనుసంధానించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ స్కైవాక్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. అవి మోనోరైల్‌ స్టేషన్లకు నేరుగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు.

ఇది ప్రయాణికులకు ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు లేదా మోనోరైల్ స్టేషన్ నుంచి వారి కార్యాలయాలకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రోడ్డు ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా సులభమైన మార్గాన్ని అందిస్తుంది. అయితే ఈ సమగ్ర ప్రణాళికలో భాగంగా వాణిజ్య భవనాల యజమానుల నుంచి అనుమతులు తీసుకోవడం కీలకం కానుంది.

పీపీపీ మోడల్

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును వేగంగా సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక వ్యూహాత్మక ఆర్థిక నమూనాను అనుసరించాలని యోచిస్తోంది. స్కైవాక్‌లు నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులు ఉపయోగించే అవకాశం ఉంది. మోనోరైలు కోసం PPP (పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్లో నిర్మించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నమూనా ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని, సాంకేతికతను వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

మోనోరైల్‌ వంటి అధునాతన రవాణా సదుపాయం అమలులోకి వస్తే, ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపశమనం లభించడమే కాకుండా, నగరానికే కొత్త రూపు తీసుకురానుంది. ఐటీ రంగం ఉద్యోగులు భారీగా నివసించే పనిచేసే ప్రాంతాల్లో మోనోరైలు లాంటి సరికొత్త రవాణా వ్యవస్థ ప్రవేశపెడితే, ట్రాఫిక్ కష్టాలు తప్పక తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

* ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూపు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) తయారీకి సన్నాహాలు చేస్తోంది. సీఎం ఆమోదం లభించిన వెంటనే, తదుపరి కొన్నేళ్లలో ఐటీ కారిడార్లు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. మోనోరైల్‌, స్కైవాక్‌ల కలయికతో కూడిన ఈ కొత్త రవాణా వ్యవస్థ హైదరాబాద్‌ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.