సెకండ్ హ్యాండ్ కారు 26వేలు.. ఎగబడ్డ జనం.. తర్వాత ధ్వంసం.. అరెస్ట్
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్‌మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. “రూ.26 వేలకు కార్ల టైర్లు కూడా రావు.. కారు ఎలా వస్తుందని నమ్మారు?” అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
By: A.N.Kumar | 27 Jan 2026 1:05 PM ISTసోషల్‌మీడియా వేదికగా అసాధారణ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఎంతోమంది గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నాచారం ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన ఈ వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేసింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.26 వేలకే సెకండ్ హ్యాండ్ కారు ఇస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయడంతో వందలాది మంది ఒకేసారి షోరూమ్ వద్దకు చేరుకున్నారు. చివరకు అది తప్పుడు ప్రచారమని తేలడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసి ఆస్తి ధ్వంసం, పోలీసుల జోక్యం, వ్యాపారి అరెస్టుతో ముగిసింది.
వైరల్‌గా మారిన ఇన్‌స్టా వీడియో
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన ట్రస్ట్ కార్ యాజమాని రోషన్ జనవరి 26న కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, తన వద్ద ఉన్న 50 కార్లను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.26 వేలకే విక్రయిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. తక్కువ ధరకే కారు వస్తుందన్న ఆశతో హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల నుంచే షోరూమ్ ముందు భారీ క్యూలు ఏర్పడ్డాయి.
మాట మార్చిన నిర్వాహకుడు
సమయం దగ్గరపడే సరికి నిర్వాహకుడు మాట మార్చాడు. తన వద్ద కేవలం 10 నుంచి 20 కార్లు మాత్రమే ఉన్నాయని మిగతావన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని చెప్పాడు. అంతేకాదు కొద్దిసేపటి తర్వాత “నా వద్ద కార్లు లేవు.. నేను అమ్మడం లేదు” అంటూ చేతులెత్తేశాడు. దూరప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమను మోసం చేశారనే భావనతో షోరూమ్‌లో ఉన్న కార్లు, కుర్చీలు, ఫర్నీచర్, సౌండ్ బాక్సులపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. అద్దాలు పగిలి, భారీగా ఆస్తి నష్టం జరిగింది.
పోలీసులు జోక్యం.. కేసు నమోదు
సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగించాడని ఆరోపిస్తూ ట్రస్ట్ కార్ యాజమాని రోషన్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు మాట్లాడుతూ సోషల్‌మీడియాలో కనిపించే అసాధారణ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తక్కువ ధరకు విలువైన వస్తువులు ఇస్తామంటూ చేసే ప్రచారాలపై ముందుగా పూర్తిగా విచారణ చేసుకోవాలని హెచ్చరించారు.
“26 వేలకే కారా?” అంటూ విమర్శలు
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్‌మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. “రూ.26 వేలకు కార్ల టైర్లు కూడా రావు.. కారు ఎలా వస్తుందని నమ్మారు?” అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు అమాయక ప్రజల ఆశలను వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం తగదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఇదే తరహాలో గతేడాది ఉప్పల్‌లో “బట్టతల ఉన్నవారికి మూడు నెలల్లో జుట్టు వస్తుంది” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ప్రచారం కూడా భారీ గందరగోళానికి దారితీసింది. తప్పుడు ప్రకటనలతో ఎంట్రీ ఫీజులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఘటనలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుడ్డిగా నమ్మొద్దు.. అప్రమత్తత అవసరం
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్యాపారులు ఇచ్చే ప్రతి ప్రకటన నిజమేనని నమ్మడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసాధారణ లాభాలు.. అతి తక్కువ ధరల ఆఫర్లు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
