కమీషన్లు.. దందాలు.. హిజ్రాల బ్లాక్ మెయిల్ వెనుక పెద్ద దందా.. సంచలన నిజాలు
హైదరాబాద్ నగరంలో గృహప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాల వేళ కొందరు ట్రాన్స్‌జెండర్లు సాగిస్తున్న అరాచకాలు.. నానాటికీ పెరుగుతున్న వసూళ్ల దందా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 8 Sept 2026 2:36 AM ISTహైదరాబాద్ నగరంలో గృహప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాల వేళ కొందరు ట్రాన్స్‌జెండర్లు సాగిస్తున్న అరాచకాలు.. నానాటికీ పెరుగుతున్న వసూళ్ల దందా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఒక గృహప్రవేశం వద్ద ఏకంగా రూ. 50 వేలు డిమాండ్ చేస్తూ యజమానులను తీవ్ర వేధింపులకు గురిచేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితురాలి ఆవేదన నగరవ్యాప్తంగా సర్వత్రా నిరసనలకు దారితీసిన నేపథ్యంలో చింతల్ ప్రాంతానికి చెందిన ఒక ట్రాన్స్‌జెండర్ సోషల్ మీడియా వీడియో ద్వారా బయటపెట్టిన సంచలన నిజాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
కొత్తగా ఇల్లు కట్టుకున్న వారి సమాచారం హిజ్రాలకు ఎలా చేరుతుందనే దాని వెనుక ఒక పెద్ద దందాయే నడుస్తోందని సదరు ట్రాన్స్‌జెండర్ పూసగుచ్చినట్లు వివరించారు. స్థానిక కాలనీవాసులతో పాటు వ్యవస్థీకృతంగా పనిచేసే అనేక వర్గాల వ్యక్తులు దీని వెనుక ఉన్నారని ఆమె తెలిపారు. ప్రధానంగా గోమాత నిర్వాహకులు, టెంట్ హౌస్ నిర్వాహకులు, బిల్డింగ్ వాచ్‌మెన్లు, హౌస్ రెంటల్ బ్రోకర్లు, సన్నాయి మేళం నిర్వాహకులు, పూజలు చేసే పురోహితులు, ఇళ్లను నిర్మించిన బిల్డర్లు కూడా కొత్త ఇళ్ల సమాచారాన్ని ముందే హిజ్రాలకు చేరవేస్తున్నారు. ఈ సమాచారం అందించినందుకు గాను ఆయా వ్యక్తులు రూ. 1,000 నుండి రూ. 3,000 వరకు కచ్చితంగా కమిషన్ వసూలు చేస్తున్నారని, అలా కమిషన్లు ఇచ్చి సమాచారం పొందిన తర్వాతే తాము గృహప్రవేశాల వద్దకు వెళ్తున్నామని సదరు హిజ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒక దారుణ సంఘటనను ప్రస్తావిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రూ. 3,000 ఇవ్వలేదనే కోపంతో చీర లేపాల్సి వచ్చిందని.. జరిగిన విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పొట్టకూటి కోసం గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలు ఆత్మీయంగా ఇచ్చిన పది, ఇరవై రూపాయలు తీసుకుని జీవించే సామాన్య ట్రాన్స్‌జెండర్లు చాలామంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు ముఠాలుగా ఏర్పడి పదివేలు, యాభైవేలు డిమాండ్ చేస్తూ ఇళ్ల యజమానులను మానసిక వేధింపులకు గురిచేయడం వల్ల మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికే చెడ్డపేరు వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ తరహా బలవంతపు వసూళ్లు, పబ్లిక్ న్యూసెన్స్ , కమిషన్ల నెట్‌వర్క్‌పై పోలీసులు, అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొందరు చేస్తున్న అక్రమాల వల్ల మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని వేధించకుండా బాధ్యులపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
