Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో తెలుగువాడి ధైర్యానికి అరుదైన పురస్కారం..

దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో నివసిస్తున్న ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు కూడా త్వరలోనే ఆస్ట్రేలియాలో స్థిరపడే అరుదైన అవకాశం లభించింది.

By:  A.N.Kumar   |   22 July 2026 1:54 PM IST
ఆస్ట్రేలియాలో తెలుగువాడి ధైర్యానికి అరుదైన పురస్కారం..
X

ఆస్ట్రేలియా గడ్డపై అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి.. పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌వాసి రెహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని అందించింది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మానవత్వాన్ని చాటుకున్న ఆయన సేవలను గుర్తిస్తూ.. ఆ దేశంలో శాశ్వత నివాస హోదా (పర్మినెంట్ రెసిడెన్సీ) ను మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో నివసిస్తున్న ఆయన భార్య, ముగ్గురు పిల్లలకు కూడా త్వరలోనే ఆస్ట్రేలియాలో స్థిరపడే అరుదైన అవకాశం లభించింది.

బాండీ బీచ్‌లో భయానక వాతావరణం.. ప్రాణదాతగా పాషా

గతేడాది డిసెంబర్‌లో సిడ్నీలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్‌లో ఇద్దరు సాయుధ దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘోర దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల మోతతో ప్రజలంతా ప్రాణభయంతో పరుగులు తీస్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రెహ్మత్ పాషా మాత్రం వెనుకంజ వేయలేదు. కాల్పుల జరుపుతున్న నిందితుడిపైకి దూకి తుపాకీ లాక్కొని తరిమికొట్టాడు. చాలా మంది ప్రాణాలను కాపాడాడు. తన స్వయం రక్షణను కూడా పక్కనపెట్టి దాదాపు మూడు గంటల పాటు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ 18 నుండి 20 మంది ప్రాణాలను కాపాడారు.

ఆస్ట్రేలియాలో వెల్లువెత్తిన ప్రశంసలు

పాషా చూపిన ఈ అసాధారణ సాహసం ఆస్ట్రేలియా ప్రజలను, ప్రభుత్వ అధికారులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ధైర్యానికి గుర్తింపుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను పలు ప్రతిష్ఠాత్మక సాహస అవార్డులకు నామినేట్ చేసింది. ఆ ఘటన సమయంలో ఆయన ధరించిన క్యాప్‌ను సిడ్నీ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించడం ఆయనకు లభించిన మరో అరుదైన గౌరవం.

ఆ మానసిక క్షోభను అధిగమించి..

ఈ దాడి దృశ్యాలు చాలా కాలం పాటు తనను తీవ్రంగా వెంటాడాయని, మానసిక ప్రశాంతత కోసం చికిత్స పొందాల్సి వచ్చిందని పాషా తెలిపారు. ఆ భయాందోళనల కారణంగా ఆయన కొంతకాలం పాటు క్యాబ్ డ్రైవర్‌గా విధులు కూడా నిర్వహించలేకపోయారు.

హైదరాబాద్ ప్రతిష్ఠను నిలబెట్టిన మానవత్వం

ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితులు తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లకు హైదరాబాద్‌తో మూలాలు ఉన్నట్లు వార్తలు రావడం నగరవాసులను కొంత దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అదే నగరానికి చెందిన రెహ్మత్ పాషా తన ప్రాణత్యాగానికి సిద్ధపడి చేసిన మానవతా సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఒకవైపు నిందితులు కలిగించిన అపఖ్యాతిని, మరోవైపు పాషా చూపిన సాహసం చెరిపివేసి భాగ్యనగర కీర్తికిరీటంలో మరొక మెరుపును చేర్చింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించిన ఈ శాశ్వత నివాస హోదా కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం మాత్రమే కాక స్వార్థం లేని మానవత్వానికి దక్కిన అత్యున్నత గుర్తింపుగా నిలిచింది.