బంగారం ధరలకు రెక్కలు.. ఒక్క గ్రామ్ ధర తెలిస్తే గుండె గుబేల్
ఇంట శుభకార్యం అంటే మొదట గుర్తొచ్చేది పసిడి. కానీ నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడికే కాదు ధనవంతుడికి కూడా గుండె ఆగిపోయినంత పని అవుతోంది.
By: Madhu Reddy | 29 Jan 2026 12:26 PM ISTఇంట శుభకార్యం అంటే మొదట గుర్తొచ్చేది పసిడి. కానీ నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడికే కాదు ధనవంతుడికి కూడా గుండె ఆగిపోయినంత పని అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఒకెత్తు, నేడు ఒక్కసారిగా కిలోమీటర్ల మేర పెరిగిన ధరలు చూస్తుంటే పసిడి ఇక అందని ద్రాక్షేనా అనిపిస్తోంది. గ్రాము ధరలో వస్తున్న భారీ మార్పులు సామాన్యుల పొదుపు కలలను చిన్నాభిన్నం చేస్తూ, పసిడి కొనాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. మరి నేడు పెరిగిన బంగారు ధరలు చూస్తే ..
కొండెక్కిన పసిడి ధరలు: ఆకాశమే హద్దుగా:
హైదరాబాద్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకుపోయాయి. నిన్నటి వరకు గ్రాముకు ₹16,708 ఉన్న 24 క్యారెట్ల బంగారం, నేడు ఏకంగా ₹17,885కి చేరింది. అంటే కేవలం ఒక్క రోజులోనే 10 గ్రాముల తులానికి ₹11,770 పెరగడం నమ్మశక్యం కాని నిజం. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం కూడా గ్రాముకు ₹1,080 పెరిగి ₹16,395కి చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న సమీకరణలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావించి కొనుగోలు చేస్తుంటే, మధ్యతరగతి ప్రజలు మాత్రం ధరల పెరుగుదల చూసి షాక్‌కు గురవుతున్నారు.
సామాన్యుడి కలలకు సెగ.. అందని ద్రాక్షగా పసిడి:
సాధారణంగా ఆడపిల్ల పెళ్లి కోసమో లేదా భవిష్యత్తు అవసరాల కోసమో రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ నేడు గ్రాము ధర కూడా ₹17 వేలు దాటడంతో, ఒక చిన్న ఉంగరం చేయించాలన్నా లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో తులం బంగారం కొనే ధరకు నేడు కేవలం రెండు, మూడు గ్రాములు మాత్రమే వస్తుండటంతో సగటు మనిషి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మాఘమాసం అందులో వివాహాల సీజన్ లో ఈ స్థాయిలో ధరలు పెరగడంతో ముఖ్యముగా పేద, మధ్యతరగతి వర్గాల పైనే కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులు ఇలాగే కొనసాగితే సామాన్యులు ఎప్పుడో చేతులెత్తేశారు.. ఇక ధనవంతులు కూడా బంగారం వైపు కన్నెత్తి చూడటం కూడా కష్టమే.
లోహం మాత్రమే కాదు..
బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు, అది భారతీయుల సెంటిమెంట్, ఆర్థిక భద్రత. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల చూస్తుంటే పసిడి ప్రజలకు దూరం అయ్యేలా కనిపిస్తోంది. ప్రభుత్వం, మార్కెట్ విశ్లేషకులు ధరలను నియంత్రించే మార్గాలను అన్వేషించాలని, అప్పుడే సామాన్యుడి పసిడి కల నెరవేరుతుందని ఆశిద్దాం.
