దూసుకెళుతున్న హైదరాబాద్.. విదేశీ కంపెనీల్ని ఆకర్షించటంలో జోరు
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరానికి పలు అంతర్జాతీయ కంపెనీలు అడుగు పెడుతున్నాయి.
By: Garuda Media | 21 Aug 2025 3:00 PM ISTమోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా మారిన హైదరాబాద్ అంతకంతకూ దూసుకెళుతోంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరానికి పలు అంతర్జాతీయ కంపెనీలు అడుగు పెడుతున్నాయి. దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లోని సానుకూలతలు పలు సంస్థల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకీ వస్తున్న కొత్త కంపెనీలతో హైదరాబాద్ కళకళలాడుతోంది.
హైదరాబాద్ కు బెంగళూరు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. అక్కడున్న మౌలిక వసతుల లేమి.. భారీ ట్రాఫిక్... హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నాయి. తాజాగా వెల్లడైన ఒక నివేదిక ప్రకారం కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఆకర్షించే విషయంలో హైదరాబాద్ కు బెంగళూరు గట్టి పోటీ ఇస్తోంది. మనదేశంలో ప్రస్తుతం 1700 జీసీసీలు ఉండగా బెంగళూరులో 487.. హైదరాబాద్ లో 273 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు మహానగరాల తర్వాత చెన్నై.. ఢిల్లీ.. ముంబయి నగరాలు ఉండటం గమనార్హం.
2028 నాటికి మన దేశంలో జీసీసీల సంఖ్య 2100 కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల్లో హైదరాబాద్ లోనే అధికంగా ఏర్పాటు అవుతున్నట్లుగా చెబుతున్నారు. కొత్తగా వస్తు్ కంపెనీల్లో ఎక్కువగా ఆర్థిక సేవలు.. జీవశాస్త్రాల విభాగానికి చెందిన కంపెనీలే ఉన్నాయి. గడిచిన కొద్ది వారాల విషయాన్నే తీసుకుంటే. అమెరికా.. ఆస్ట్రేలియా.. ఐరోపా దేశాలకు చెందిన కంపెనీలు తమ జీసీసీలను హైదరాబాద్ లో ఏర్పాటు చేవాయి.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ మెక్వారీ గ్రూపు.. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ స్టాక్ ఎక్ఛ్సైంజీని నిర్వహించే డాయిష్ బోర్డ్స్ సైతం హైదరాబాద్ లో జీసీసీ కేంద్రాల్ని ఇటీవల ఏర్పాటు చేయటం గమనార్హం. జీవ శాస్త్రాలు.. ఫార్మా రంగానికి చెందిన టాప్ 10 బహుళ జాతి సంస్థల్లో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్ లో జీసీసీలు ఏర్పాటు చేయటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అంతర్జాతీయ కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు రియల్ రంగంలో మరింత జోరు ప్రదర్శించే వీలుందని చెబుతున్నారు.
