Begin typing your search above and press return to search.

గణేష్ లడ్డూ వేలం పాటలు : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వేలం ఎక్కడ జరిగిందంటే? టాప్ లిస్ట్ ఇదీ

భాగ్యనగరంలో గణేశ్ నవరాత్రి వేడుకల వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  A.N.Kumar   |   24 Sept 2026 9:07 AM IST
గణేష్ లడ్డూ వేలం పాటలు : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వేలం ఎక్కడ జరిగిందంటే? టాప్ లిస్ట్ ఇదీ
X

భాగ్యనగరంలో గణేశ్ నవరాత్రి వేడుకల వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో మిన్నంటే భక్తిశ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాల్లో "లడ్డూ వేలం పాట" ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్వామివారి లడ్డూను దక్కించుకుంటే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల అపారమైన విశ్వాసం. కాలక్రమేణా ఈ వేలం పాటలు కేవలం వీధులకే పరిమితం కాకుండా హైదరాబాద్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

రూ.30.5 లక్షలతో అగ్రస్థానంలో 'కోహినూర్'

సాధారణంగా హైదరాబాద్ లో లడ్డూల వేలంలో రికార్డులు నెలకొల్పేది. హైదరాబాద్‌లో లడ్డూ వేలం అనగానే ముందుగా గుర్తువచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డూ. 1994లో ప్రారంభమైన ఈ సంప్రదాయంలో కేవలం రూ. 450లతో మొదలైన వేలం.. ఏటికేడు పెరిగి లక్షల్లో పలుకుతోంది. కానీ ఈసారి బాలాపూర్ ను మించిన వేలం పాటలు హైదరాబాద్ లో నమోదయ్యాయి. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల లడ్డూ వేలంలో అత్యధిక ధర పలికిన లడ్డూగా హైటెక్ సిటీలోని 'కోహినూర్ బై ఆర్రో రియాల్టీ' రికార్డు సృష్టించింది. ఇక్కడ నిర్వహించిన వేలంలో స్వామివారి లడ్డూ ఏకంగా రూ.30,50,001 పలికి సరికొత్త చరిత్ర తిరగరాసింది.

కోహినూర్ తర్వాతి స్థానంలో ప్రముఖ 'మై హోమ్ భూజా' కమ్యూనిటీ నిలిచింది. ఇక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదం రూ. 25,00,000 కు అమ్ముడై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 'మై హోమ్ మంగళ' కమ్యూనిటీలో ఈ లడ్డూ రూ. 21,11,116 ధర పలికి టాప్ రికార్డుల జాబితాలో చేరింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ గణేశ్ లడ్డూల వేలం వివరాలు చూస్తే..

1. కోహినూర్ బై ఆర్రో రియాల్టీ (హైటెక్ సిటీ): రూ. 30,50,001

2. మై హోమ్ భూజా: రూ. 25,00,000

3. మై హోమ్ మంగళ: రూ. 21,11,116

4. నెల్లూరు లంబోదర: రూ. 13,50,000

5. ఇండిస్ వివా సిటీ, హైదరాబాద్: రూ. 13,00,000

6. ప్రగతి నగర్, హైదరాబాద్: రూ. 13,00,000

7. కూకట్‌పల్లి: రూ. 10,00,000 కు పైగా

8. ఫ్రంట్‌లైన్ సెవెన్: రూ. 8,00,000 కు పైగా పలికింది.

9. మై హోమ్ అవతార్: రూ. 8,00,000 కు పైగా వేలం పాడారు.

లడ్డూ వేలం వెనుక భక్తి.. సామాజిక బాధ్యత

గణేశ్ లడ్డూ వేలం అనేది కేవలం ఒక ప్రసాదాన్ని దక్కించుకునే ప్రక్రియ మాత్రమే కాదు. దీని వెనుక గణపయ్య అపారమైన ఆశీస్సులు ఉన్నాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గేటెడ్ కమ్యూనిటీలలో వేలం ద్వారా సమకూరిన భారీ మొత్తాన్ని కమ్యూనిటీ సంక్షేమం, స్థానిక అభివృద్ధి, అనాథాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం లేదా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

భక్తి, నమ్మకం, సామాజిక బాధ్యతల కలబోతగా మారుతున్న ఈ వేలం పాటలు నగర సంస్కృతిలో భాగమైపోయాయి. ప్రస్తుతం రూ.30.50 లక్షలతో కోహినూర్ కమ్యూనిటీ అగ్రస్థానంలో నిలవగా రాబోయే రోజుల్లో ఈ ఆల్ టైమ్ రికార్డును ఏ కమ్యూనిటీ తిరగరాస్తుందో వేచి చూడాలి.