నిమజ్జనం : రాజుకుంటున్న రగడ !
సెప్టెంబర్ 14 సోమవారం నాడు వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల్లో గణేషుని విగ్రహాలను ప్రతిష్టించేందుకు భక్తులు సిద్దమవుతున్నారు.
By: Tupaki Political Desk | 2 Sept 2026 12:40 PM ISTసెప్టెంబర్ 14 సోమవారం నాడు వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల్లో గణేషుని విగ్రహాలను ప్రతిష్టించేందుకు భక్తులు సిద్దమవుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో మనం ప్రతి ఏటా చూస్తున్నదే. అయితే వినాయక చవితి నేపథ్యంలో వినాయకుల నిమజ్జనం అంశంపై హైడ్రా - భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మధ్య మొదలయిన వివాదం మెల్లగా రాజుకుంటున్నది.
హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన, పునరుద్ధరించిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అనుమతించమని హైడ్రా స్పష్టం చేసింది. ముఖ్యంగా కాప్రా చెరువును కేంద్ర ప్రభుత్వం కీలక పట్టణ వెట్ ల్యాండ్ గా గుర్తించిందని, వరద నీటి నిల్వ, భూగర్భజలాలు రీఛార్జ్, జీవవైవిధ్యం, 470 పైచిలుకు వలస పక్షుల ఆవాసం కారణంగా నిమజ్జనం అనుమతించమని చెబుతోంది. చిన్న విగ్రహాలకు బేబీ పాండ్ లు, పెద్ద వాటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు వివరించారు.
అయితే నిమజ్జనం అడ్డుకునే అధికారం హైడ్రాకి లేదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం అడ్డుకోవడం తగదని, ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లే కాప్రా సహా నగరంలోని అన్ని చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తామని గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. విగ్రహాల నిమజ్జనం మూలంగా చెరువులు కలుషితం అవుతున్నాయి అన్న వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవని, చెరువుల యజమానులు ప్రజలే తప్ప అధికారులు కాదని గణేష్ ఉత్సవ సమితి వాదిస్తోంది.
1954లో హైదరాబాద్ అతిపెద్ద ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సింగారి శంకరయ్య చేత స్థాపించబడింది. 1970ల నుండి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. 1980 నాటికి అది పెద్ద ఎత్తున నగరంలోని సాంప్రదాయంగా మారింది.
1954 నుండి ఖైరతాబాద్ సహా పెద్ద విగ్రహాలు హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం అవుతున్నాయి. ఆ తర్వాత నగరంలోని ఆయా సమీప చెరువుల్లో విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో స్థాపించారు. 1400 నుండి 1500 మండపాలతో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు నేడు లక్షల స్థాయికి చేరుకుంది. ఈ ఉత్సవ సమితి నగరంలోని వినాయక ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లను సమన్వయం చేస్తుంది. మరి నిమజ్జనం విషయంలో హైడ్రా - గణేష్ ఉత్సవ సమితి మద్య మొదలైన వివాదం ఎలా ముగుస్తుంది అనేది వేచిచూడాల్సిందే.
