మూసీ ఉగ్రరూపం.. దెబ్బతిన్న నగర అంతర్గత ట్రాఫిక్ వ్యవస్థ!
ఉదయం నుంచి భారీగా కురుస్తున్న వర్షం, జంట జలాశయాల గేట్లు ఎత్తడం, ఎగువనుంచి వస్తున్న భారీ వరద నీరు కలిసి హైదరాబాద్ నగరానికి అతిపెద్ద ముప్పును తెచ్చిపెట్టాయి.
By: Tupaki Political Desk | 27 Sept 2025 1:38 PM ISTఉదయం నుంచి భారీగా కురుస్తున్న వర్షం, జంట జలాశయాల గేట్లు ఎత్తడం, ఎగువనుంచి వస్తున్న భారీ వరద నీరు కలిసి హైదరాబాద్ నగరానికి అతిపెద్ద ముప్పును తెచ్చిపెట్టాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో (30 సంవత్సరాల్లో) ఎన్నడూ లేని విధంగా మూసీ ఉగ్రరూపం దాల్చింది. గండిపేట మొదలుకొని నాగోల్ వరకు పరివాహక ప్రాంతాలన్నీ జలమయం కావడం. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమ జీవిత కాల సంపాదన ఒక్క క్షణంలో వరదలో కొట్టుకుపోవడం, ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి కలచివేస్తోంది. చాదర్‌ఘాట్, మూసానగర్, రసూల్‌పురా వంటి ప్రాంతాలు ముంపునకు గురవడం, వందలాది ఇళ్లు నీటిలో చిక్కుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి.
దెబ్బతిన్న నగర అంతర్గత ట్రాఫిక్ వ్యవస్థ..
ట్రాఫిక్ వ్యవస్థ దెబ్బతింది. కాజ్‌వేలు, వంతెనలు వరదలో మునిగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లోపలికి వరద నీరు చేరడం. ప్రయాణికులు చిక్కుకుపోవడం నగర మౌలిక సదుపాయాల బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది. ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. రక్షణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు తీసుకుంటున్నాయి.
మరింత ఉగ్రంగా మారిన మూసీ..
మూసీ నది ఉగ్రరూపాన్ని నగర వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. బాపూఘాట్ దిగువన ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. పురానాఫూల్ వంతెన వద్ద 13 అడుగుల నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసరాలు పూర్తిగా నీట మునిగాయి. చాదర్ ఘాట్ వద్ద వంతెన నీట మునిగింది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లోకి నీరు చేరింది. దీంతో తాత్కాలికంగా బస్సులు బస్టాండ్ కు రావడం లేదు.
నీట మునిగిన ఎంజీబీఎస్..
మూసీ నది ఉగ్రరూపంతో నివాస ప్రాంతాలే కాకుండా నగర రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణంలోకి వరద చేరడం, హైదరాబాద్ రవాణా చరిత్రలో అరుదైన సంఘటన గత 30 ఏళ్లలో ఇది జరగలేదని అధికారులు అంటున్నారు. దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రయాణ కేంద్రంగా ఉన్న ఈ బస్టాండ్ నుంచి ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోవడం అదీ పండుగ సీజన్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెంటనే రంగంలోకి ఆర్టీసీ..
అయితే ఆర్టీసీ తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే సర్వీసులను నగరంలోని ఇతర కీలక ప్రదేశాల నుంచి నడపుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లేవి జేబీఎస్ నుంచి వరంగల్, హన్మకొండ వైపు వెళ్తున్నవి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ నుంచి సూర్యాపేట, నల్గొండ, విజయవాడ సర్వీసులు ఎల్‌బీనగర్ నుంచి, అలాగే మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు దిశగా వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడపడం ద్వారా ప్రయాణికుల భారం తగ్గింది.
ఆయా ప్రాంతాలకు లోకల్ బస్సులు..
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు పలు విషయాలు వివరించారు. పొరపాటున కూడా ఎవరూ ఎంజీబీఎస్‌కు రావద్దని, వివిధ ప్రాంతాల్లోని బస్ స్టేషన్లకు వెళ్లేందుకు లోకల్ బస్సులు అరెంజ్ చేసినట్లు చెప్పారు. ఉప్పల్, జేబీఎస్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రవాణా ప్రదేశాలు ముంపునకు గురి కాకుండా ఉండాలని పలువురు భావిస్తున్నారు.
