హైదరాబాద్ ను ముంచెత్తింది..
హైదరాబాద్ నగర శివారులో గురువారం కురిసిన కుండపోత వర్షం మరోసారి మన నగర మౌలిక సదుపాయాల బలహీనతను బయటపెట్టింది.
By: A.N.Kumar | 11 Sept 2025 10:58 PM ISTహైదరాబాద్ నగర శివారులో గురువారం కురిసిన కుండపోత వర్షం మరోసారి మన నగర మౌలిక సదుపాయాల బలహీనతను బయటపెట్టింది. కేవలం గంటన్నర వర్షానికి రోడ్లు చెరువుల్లా మారిపోవడం, వాహనాలు నిలిచిపోవడం, కాలనీలు జలమయమవడం.. ఇవన్నీ మనం ప్రతిసారీ చూసే దృశ్యాలే. కానీ సమస్యకు మూలమైన శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
* వర్షం అంటే నగరానికి భయం
ప్రతి ఏడాది మాన్సూన్ సమయాల్లోనే కాకుండా ఎప్పుడైనా కురిసే భారీ వర్షం నగరాన్ని స్థంభింపజేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి ప్రాంతాలు వర్షానికి బీభత్సానికి గురవుతుంటే, నగరాన్ని కలిపే జాతీయ రహదారులూ సైతం నీటమునిగిపోవడం ప్రజల ప్రాణాలను, ఆర్థిక నష్టాలను ముప్పులోకి నెడుతోంది. కేవలం మోకాళ్ల లోతు నీటే కాదు, ఆ నీటిలో కలిసిపోయే మురికి, కాలువల ఓవర్‌ఫ్లో, పాడైన రహదారులు ప్రజారోగ్యానికి కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయి.
మెదక్ దృశ్యం హెచ్చరిక
హైదరాబాద్ మాత్రమే కాదు, మెదక్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. మూడు గంటల్లోనే 13 సెం.మీ. వర్షం కురవడం, రహదారులు చెరువుల్లా మారిపోవడం, హైవేపై జేసీబీతో డివైడర్లు తొలగించాల్సిన స్థితి రావడం – ఇవన్నీ వర్షపాతం పెరుగుతున్న తీరును గుర్తు చేస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి ఆకస్మిక వర్షాలు మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రణాళికలేని పట్టణాభివృద్ధి ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
తక్షణ చర్యలకన్నా శాశ్వత పరిష్కారం అవసరం
ప్రతి వర్షానికి ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనాలు నడిపించడం, అధికారులు డివైడర్లు కూల్చించడం, మోటార్‌లతో నీరు బయటకు పంపడం – ఇవి తాత్కాలిక చర్యలు మాత్రమే. నగరంలో వర్షపు నీటి కాలువల నిర్వహణ, సరైన డ్రైనేజీ వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో సమయానుసార చర్యలు తీసుకోవడమే అసలైన పరిష్కారం. లేకుంటే ప్రతి వర్షం ఒక విపత్తే.
హైదరాబాద్ వర్షానికి తట్టుకోలేని నగరంగా పేరుపొందకముందే నగర పాలకులు మేల్కొనాలి. కాంక్రీట్ జంగిల్ పెరుగుతున్న కొద్దీ వర్షపు నీటిని తట్టుకునే సహజ వనరులు క్షీణిస్తున్నాయి. ఈ స్థితిలో కేవలం వర్షం నిందించడం సరిపోదు. పౌరుల ప్రాణాలు, ఆస్తులను కాపాడే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే భవిష్యత్తులో నిజమైన పరీక్ష.
