Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని ఆ ఫ్లైట్ రెస్టారెంట్ ఇస్పెషల్.. వెళ్లాల్సిందే

రోజూ తినే ఆహారమే అయినా.. కొత్త రుచులతో తినే అవకాశాన్ని వదులుకోకూడదు. మారిన కాలానికి అనుగుణంగా ఎన్నెన్నో కొత్త రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

By:  Garuda Media   |   30 July 2025 12:00 PM IST
హైదరాబాద్ లోని ఆ ఫ్లైట్ రెస్టారెంట్ ఇస్పెషల్.. వెళ్లాల్సిందే
X

రోజూ తినే ఆహారమే అయినా.. కొత్త రుచులతో తినే అవకాశాన్ని వదులుకోకూడదు. మారిన కాలానికి అనుగుణంగా ఎన్నెన్నో కొత్త రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వడ్డించే ఆహారం మాత్రమే కాదు.. లుక్ అండ్ ఫీల్ విషయంలోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్న వారికి కొదవ లేదు. అయితే.. ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో సరికొత్త అనుభూతిని పంచేందుకు ఒకరు చేసిన ప్రయత్నం ఆసక్తికరంగానే కాదు.. ఆకట్టుకునేలా ఉంది. విమాన రెస్టారెంట్ల గురించి వినే ఉంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే ఫ్లైట్ రెస్టారెంట్ రోటీన్ కు కాస్త భిన్నమైనది.

హైదరాబాద్ శివారులోని గండిమైసమ్మ (బాచుపల్లి నుంచి కానీ బాలానగర్.. జీడిమెట్ల మీదుగా కానీ సికింద్రాబాద్ నుంచి కానీ ఈ రెస్టారెంట్ కు చేరుకోవచ్చు)లోని కేవీఆర్ఎస్ ఫ్లైట్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. మలేసియాలోని ఒక పాత విమానాన్ని కొనుగోలు చేసి.. దానిలోని ఇంటీరియల్ లో కాస్త మార్పులు చేసి.. దాన్ని రెస్టారెంట్ గా మార్చారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన వెంకట్ రెడ్డి.

ఈ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వేళ.. భిన్నమైన అనుభూతిని కలిగేలా ఏర్పాట్లు చేశారు. విమానంలోకి ఎక్కే ముందు ఎయిర్ హోస్టెస్ డ్రెస్ లో ఉన్న సిబ్బంది స్వాగతం పలుకుతారు. సీట్ బెల్ట్ పెట్టుకోమన్న ప్రకటన వినిపిస్తుంది. గాల్లో ఎగురుతున్నట్లుగా.. తిరిగి ల్యాండ్ అయినట్లుగా అనుభూతి చెందేందుకు వీలుగా సిమ్యులేటర్ ను ఆన్ చేస్తారు. వెల్ కం డ్రింక్ ఇస్తారు. ఆ తర్వాత ఆర్డర్ చేసిన భోజనాన్ని తీసుకొస్తారు. ఇలా.. ఓవైపు కోరుకున్న ఫుడ్ ను సర్వ్ చేయటమే కాదు.. ఫ్లైట్ లో జర్నీ చేసిన అనుభూతిని కలిగేలా చేయటమే ఈ ఫ్లైట్ రెస్టారెంట్ స్పెషాలిటీగా చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ట్రై చేస్తే పోలా?