హైదరాబాద్ వాసులకు ఇక సిగ్నల్ ఫ్రీ జర్నీ
అయితే ఈ నిత్య ట్రాఫిక్ తిప్పలకు శాశ్వత ముగింపు పలుకుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక వినూత్న "ఫ్లైఓవర్ మంత్రం" వేసేందుకు సిద్ధమైంది.
By: A.N.Kumar | 8 Sept 2026 8:00 PM ISTహైదరాబాద్ నగరంలో బండి బయటకు తీయడం ఒక పెద్ద సాహసం అయితే బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు ప్రయాణించడం ఒక నిరంతర "మహా సంగ్రామం". రోజూ ఉదయాన్నే ఆఫీసులకు పరుగులు తీసే ఐటీ ఉద్యోగులు, ఇతర వాహనదారుల జీవితాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మైండ్‌స్పేస్, గచ్చిబౌలి సిగ్నళ్ల వద్దే సగానికి పైగా కరిగిపోతున్నాయి. స్టీరింగ్ గట్టిగా పట్టుకుని, బ్రేక్‌పై కాలు వేసి, ఆ ఎర్రటి ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు పచ్చగా మారుతుందో అని ఎదురుచూస్తూ నగరవాసులు పడే నరకయాతన వర్ణనాతీతం. అయితే ఈ నిత్య ట్రాఫిక్ తిప్పలకు శాశ్వత ముగింపు పలుకుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక వినూత్న "ఫ్లైఓవర్ మంత్రం" వేసేందుకు సిద్ధమైంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపం నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఏకంగా 9 కిలోమీటర్ల మేర ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంటే ఇక నుంచి కింద ఉండే విపరీతమైన రద్దీలో నలిగిపోకుండా పైన హాయిగా గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చన్నమాట. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.1,656 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టబోతున్నారు. ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి.. దిగడానికి వీలుగా ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 82, నార్నే రోడ్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52, ఐటీసీ కోహినూర్, టీ-హబ్, మైండ్‌స్పేస్ వంటి కీలక ప్రాంతాల్లో స్పెషల్ ర్యాంపులను అందుబాటులోకి తేనున్నారు.
ఈ భారీ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొదటి దశలో ఫిల్మ్‌నగర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 5 కిలోమీటర్లు, రెండో దశలో కమాండ్ కంట్రోల్ నుంచి హకీంపేట కుంట వరకు 4 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇంకో విశేషమేమిటంటే భవిష్యత్‌లో ఒకవేళ ఇదే మార్గంలో మెట్రో రైలు విస్తరణ చేపట్టాల్సి వస్తే దానికి కూడా అనుకూలంగా ఉండేలా ఈ కారిడార్ డిజైన్‌ను రూపుదిద్దారు.
కాగితాల మీద అలాగే సెప్టెంబర్ 22 వరకు ఆహ్వానిస్తున్న టెండర్లలో ఈ ప్లాన్ వినడానికి ఒక హాలీవుడ్ రేసింగ్ సినిమాను తలపించేలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. కానీ పక్కా హైదరాబాదీలకు మాత్రం లోలోపల ఒక చిన్న భయం పట్టుకుంది. ఈ 9 కిలోమీటర్ల భారీ కారిడార్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కింద ఉండే రోడ్లపై వెళ్లే వాహనదారుల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే కొన్ని సంవత్సరాల పాటు రోడ్లపై పొగ, దుమ్ము, పిచ్చిపిచ్చి బారికేడ్ల మధ్య డ్రైవింగ్ చేస్తూ నగరవాసులు ఒలింపిక్ స్థాయి డ్రైవింగ్ స్కిల్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా రోజువారీ నరకం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందంటే ఈ మాత్రం ఓపిక పట్టక తప్పదు. ఈ గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తయితే బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలికి వెళ్లే క్రమంలో సిగ్నల్ పడగానే గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే ఎరుపు రంగును చూసి ఏడవాల్సిన పని ఉండదు. హాయిగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బండిని పోనిస్తూ సమయాన్ని ఆదా చేసుకునే మహత్తర రోజులు త్వరలోనే రాబోతున్నాయి.
