Begin typing your search above and press return to search.

ఆ మోడ్ డ్రైవింగ్ కుదరదని పోలీసుల వార్నింగ్..

ఫోన్‌లో వీడియోలు చూడడం, ఇయర్‌ఫోన్లు పెట్టుకొని పాటలు వింటూ డ్రైవ్ చేయడం వంటి అలవాట్లు వాహన నడుపుతున్నప్పుడు పూర్తిగా వదిలేయాలి.

By:  Tupaki Political Desk   |   7 Oct 2025 3:42 PM IST
ఆ మోడ్ డ్రైవింగ్ కుదరదని పోలీసుల వార్నింగ్..
X

వాహనం నడపాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి..? డ్రైవింగ్ లైసెన్స్ అంటున్నారా..? అది ఖచ్చితంగా ఉండాల్సిందే.. దీనితో పాటు మరోటి కూడా ఉండాలి.. లేదంటే కఠిన శిక్షలు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. ఆగండాగండి అది ఏం పేపరు పొల్యూషనా.. లేక ఆర్సీనా.. అను కోకండి అది పేపర్ కాదు.. అది మన వద్దనే ఉండేది. అదే.. ఏకాగ్రత (కాన్సన్‌ట్రేషన్). ఎంత పెద్ద తోపు డ్రైవరైనా.. ఎన్ని సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ ఉన్నా.. ఏకాగ్రత లేనిది ఇవన్నీ వ్యర్థమే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చార్జి తీసుకున్న సజ్జనార్ వాహన యజమానులు, డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

గుబులు రేపుతున్న హెచ్చరిక..

హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక పట్టణవాసుల్లో గుబులు రేపుతోంది. వాహనం నడుపుతూ ఫోన్లో వీడియోలు చూడడం, బైక్ నడిపేటప్పుడు పాటలు వినడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైన పనులు అని చెప్పారు. ఈ నియమావళి కేవలం సూత్రాలు మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడే చర్యలుగా తీసుకోవాలన్నారు.

ఆ అలవాట్లను వదిలేయాలి..

ఫోన్‌లో వీడియోలు చూడడం, ఇయర్‌ఫోన్లు పెట్టుకొని పాటలు వింటూ డ్రైవ్ చేయడం వంటి అలవాట్లు వాహన నడుపుతున్నప్పుడు పూర్తిగా వదిలేయాలి. ఇలాంటివి డ్రైవింగ్ పై ఏకాగ్రతను తప్పిస్తాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతాయి. పోలీసులు జారీ చేసిన ఈ హెచ్చరిక బైక్ నుంచి బస్సు వరకు ప్రతి వాహనం నడుపుతున్నప్పుడు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు..

పోలీసుల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నియమాలను పాటించని డ్రైవర్లపై పెనాల్టీలు, అదనపు తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్‌లు ఉంటాయన్నారు. అలాగే, బైక్ ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఈ నియమాలు ప్రత్యేకంగా వర్తిస్తాయని, బస్ డ్రైవర్లకు కూడా అమలు చేయాల్సినట్లుగా ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆదేశాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

వారి సంకల్పానికి తోడవ్వాలి..

వాహనం నడుపుతున్నప్పుడు ఫోకస్ రోడ్డుపైనే ఉండాలి. అప్పుడు ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది. పోలీసుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా ప్రయాణం చేయాలి. రోడ్లు ప్రమాద రహిత నగరంగా పట్టణాన్ని మార్చాలని పోలీసుల సంకల్పానికి ప్రతి ఒక్కరూ తోడవ్వాలి.