టార్గెట్ కిల్లింగ్ కాదు.. భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా ప్లానింగ్
ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ ఉగ్రవాదులు పలువురిని అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో తీసుకోవటం తెలిసిందే. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన వైద్యుడు (మొయినుద్దీన్ సయ్యద్) ఒకరు.
By: Garuda Media | 14 Nov 2025 9:39 AM ISTఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ ఉగ్రవాదులు పలువురిని అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో తీసుకోవటం తెలిసిందే. వీరిలో హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన వైద్యుడు (మొయినుద్దీన్ సయ్యద్) ఒకరు. తాజాగా వీరి విచారణలో వెల్లడించిన విషయాలు విస్తుపోయేలా చేసింది. అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఎలా తయారు చేశారు? దాన్ని ఎక్కడ.. ఎలా వినియోగించాలని ప్లాన్ చేశారు? ఈ మాడ్యూల్ లో ఇంకెంత మంది ఉన్నారు? లాంటి అంశాలకు సంబంధించి కీలక అంశాల్ని గుర్తించారు. ఎంపిక చేసిన వారిని మట్టు పెట్టే టార్గెట్ కిల్లింగ్ వద్దని.. అందుకు బదులుగా ఎక్కువ ప్రాణ నష్టం కలిగేలా మాస్ కిల్లింగ్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తించారు.
అహ్మదాబాద్ ఏటీఎస్ చేపట్టిన తనిఖీల్లో అరెస్టు అయిన హైదరాబాద్ కు చెందిన వైద్యుడు మొయినుద్దీన్ సయ్యద్ పలు అంశాల్ని వెల్లడించారు. ఈ మాడ్యూల్ ను పాక్ - అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండే అబు ఖదీజా ఆదేశాలకు తగ్గట్లు పని చేసే వారు మొయినుద్దీన్. అవసరమైన సమాచారంతో పాటు.. మాస్ కిల్లింగ్ కు అవసరమైన బాంబులు.. పిస్టళ్లు లాంటివి వినియోగించే కన్నా... విషాన్ని ప్రయోగించాలని ప్లాన్ చేశారు. ఇందుకు అవసరమైన పత్రాల్ని టెలిగ్రామ్ ద్వారా షేర్ చేసిన విషయాన్ని విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ప్రాణాంతకమైన విషాన్ని అముదం గింజలతో ఎలా తయారు చేయాలన్న అంశాల్ని వివరించే పత్రాల్ని పీడీఎఫ్ ఫార్మాట్ లో పంపినట్లుగా గుర్తించారు. దీనికి అదనంగా ఇంటర్నెట్ లో వెతికిన మొయినుద్దీన్ దాని తయారీపై కొంత పట్టును సాధించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి రుచి లేని ఈ విషపదార్థం సైనైడ్ కంటే కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు. దీని తయారీ కోసం స్థానిక మార్కెట్ లో అముదం గింజల్ని సేకరించాడు. వాటిపై ఉండే తెల్లడి బుడిపె నుంచి ఈ విషాన్ని తయారు చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు అవసరమైన చిన్న సైజులో ఉండే పల్స్ ఎక్స్ ట్రాక్టర్ మిషిన్ ను ఖరీదు చేశాడు.
షావర్మా సెంటర్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మిషన్ తన వద్ద ఉన్నట్లుగా తెలిసినా ఎవరూ అనుమానించరన్న పథకాన్ని రచించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే ఈ మిషన్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిల్లో అబు ఖదీజా పంపిన పీడీఎప్ ప్రింట్ లతో పాటు పల్స్ ఎక్స్ ట్రాక్టర్ మిషన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. షావర్మా సెంటర్ లో రిసిన్ తయారు చేస్తున్న మొయినుద్దీన్ దీని వియోగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని తెలుస్తోంది.
అబూ ఖదీజా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేపట్టొద్దన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో మొయినుద్దీన్ పలుమార్లు అహ్మదాబాద్ కు వెళ్లినట్లుగా ఏటీసీ అధికారులు గుర్తించారు. కొద్ది కాలం క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొంత డబ్బుల్ని తీసుకున్నట్లుగా నిర్దారించారు. అయితే.. సదరు వ్యక్తి ఎవరో తనకు తెలీదని విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ మాడ్యూల్ లో మరింతమంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
