Begin typing your search above and press return to search.

ఆటో ప్రయాణం భయంకర అనుభవంగా మారింది

అత్యాధునిక డిజిటల్ చెల్లింపుల యుగంలో, ఒక ఆటో ప్రయాణం 68 ఏళ్ల వృద్ధుడికి చేదు అనుభవాన్ని, దాదాపు రెండు లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.

By:  A.N.Kumar   |   5 Oct 2025 4:21 PM IST
ఆటో ప్రయాణం భయంకర అనుభవంగా మారింది
X

అత్యాధునిక డిజిటల్ చెల్లింపుల యుగంలో, ఒక ఆటో ప్రయాణం 68 ఏళ్ల వృద్ధుడికి చేదు అనుభవాన్ని, దాదాపు రెండు లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ నుంచి తార్నాక వరకు జరిగిన ఈ ప్రయాణంలో ఆటో డ్రైవర్ చేసిన అత్యంత తెలివైన QR కోడ్ మోసం నగరం వాసులను ఆందోళనకు గురిచేసింది.

₹1.95 లక్షలు మాయం!

సంఘటన సెప్టెంబర్ 17న చోటుచేసుకుంది. ఉప్పల్ నుండి తార్నాకకు ఆటోలో ప్రయాణించిన 68 ఏళ్ల వృద్ధుడు గమ్యస్థానం చేరుకున్నాక, ఆటో డ్రైవర్ అందించిన QR కోడ్‌ను స్కాన్ చేసి ఆటో ఛార్జీ చెల్లించడానికి ప్రయత్నించాడు. చెల్లింపు జరుగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా వృద్ధుడి చేతిలోంచి మొబైల్ ఫోన్‌ను లాక్కుని ఉడాయించాడు.

తర్వాత ఆ డ్రైవర్‌ , అతని ఇద్దరు మిత్రులు మొహమ్మద్ మొయిన్ ఉద్దీన్, మొహమ్మద్ సయ్యద్ సల్మాన్, మొహమ్మద్ హుస్సైన్ కలిసి ఆ మొబైల్ ఫోన్ ఉపయోగించి వృద్ధుడి బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా ₹1.95 లక్షల రూపాయలను పలు ఆన్‌లైన్ యాప్‌లు, QR కోడ్‌ల ద్వారా తమ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఈ నిందితులు ఆ సొమ్మును పెట్రోల్ బంకులు, షాపులు, గేమింగ్ సైట్లు వంటి వాటిలో ఖర్చు చేసినట్లు తెలిసింది.

*సైబర్ క్రైమ్ బృందం వలలో మోసగాళ్లు

వృద్ధుడు తన ఖాతా నుంచి వరుసగా డబ్బులు డెబిట్ అవుతున్నట్లు గమనించి వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, ముగ్గురు నిందితులను విజయవంతంగా పట్టుకుంది. వారి నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌తో సహా మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

* పోలీసుల హెచ్చరిక: అప్రమత్తంగా ఉండండి!

ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు జారీ చేశారు. డిజిటల్ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా తెలియజేశారు.

పోలీసులు చెప్పిన ముఖ్య సూచనలు ఇవే

ఫోన్‌ను ఎవరికీ ఇవ్వవద్దు. డిజిటల్ చెల్లింపుల సమయంలో లేదా మరే సందర్భంలోనైనా మీ మొబైల్‌ను ఇతరుల చేతుల్లోకి ఎప్పటికీ ఇవ్వకండి. కేవలం స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయడం వరకే మీ పని పరిమితం కావాలి.

అనుమానాస్పద QR కోడ్‌లు వద్దు. అనుమానాస్పదంగా కనిపించే ఏ QR కోడ్‌లను కూడా స్కాన్ చేయవద్దు. స్కాన్ చేసే ముందు చెల్లింపుదారు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.

మీ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు లేదా అధిక మొత్తం డెబిట్ అయినట్లు గమనిస్తే, వెంటనే మీ బ్యాంక్‌కు , పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయడం వల్ల డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

పోలీసులు ఈ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు గురికాకుండా తమను తాము కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.