ఫేస్ బుక్ లో పరిచయం.. హైదరాబాద్ వైద్యుడికి రూ.14.6కోట్ల టోకరా
ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళ మాటల్ని నమ్మి ఇంత భారీగా మోసపోవటం గమనార్హం. సదరు మహిళ విసిరిన చాటింగ మత్తులో కోట్లకు కోట్లు పోగొట్టుకున్న వైనం తాజాగా సైబర్ పోలీసులకు చేరింది.
By: Garuda Media | 28 Sept 2026 11:39 AM ISTఆన్ లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నెత్తినోరు బాదుకుంటున్నప్పటికి.. ఎన్నో మోసాలు.. దారుణాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికి.. సైబర్ నేరస్తుల చేతికి చిక్కి విలవిలాడిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అవగాహన లేని వారు.. పెద్దగా చదువుకోనివారు.. సామాజిక అంశాలపై అవగాహన లేని వారు.. యుక్త వయసులో ఉన్న వారు మోసపోయారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. దంత వైద్యుడిగా పని చేస్తూ.. సామాజిక అంశాల మీద అవగాహన ఉండే వ్యక్తి.. ఆన్ లైన్ మోసానికి బలై ఏకంగా రూ.14.6 కోట్లకు బలి కావటం చూస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి. హైదరాబాద నగరానికి చెందిన ఒక డెంటిస్ట్ కు ఎదురైన చేదు అనుభవం చూస్తే.. షాక్ కు గురవ్వాల్సిందే.
ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళ మాటల్ని నమ్మి ఇంత భారీగా మోసపోవటం గమనార్హం. సదరు మహిళ విసిరిన చాటింగ మత్తులో కోట్లకు కోట్లు పోగొట్టుకున్న వైనం తాజాగా సైబర్ పోలీసులకు చేరింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి నుంచి భారీగా కొల్లగొట్టిన మొత్తంలో ఇదే పెద్దదని పోలీసులు చెబుతున్నారు. ఎర్రగడ్డకు చెందిన డెంటిస్ట్ ఈ భారో మోసం బారిన పడి.. పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగు చూసింది.
ఈ ఏడాది ఆగస్టు 27న నలభై నాలుగేళ్ల డెంటిస్ట్ కు ఫేస్ బుక్ ద్వారా ఒక మహిళ పరిచయమైంది. చెన్నైకు చెందిన ఆమె తనను మోనికా మాధవ్ గా పరిచయం చేసుకున్నారు. తమ మధ్య పరిచయాన్ని మరింతగా పెంచుకోవటానికి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ అయిన టెలిగ్రామ్ లోకి రావాలని ఆమె సూచించింది. టెలిగ్రామ్ లో వీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో తనకు గతంలో పెళ్లైందని.. విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతూ.. త్వరలోనే తనకు విడాకులు రానున్నట్లుగా చెప్పింది.
ఇలా మాటలు చెబుతూ వలపువల సంధించిన ఆమె ట్రాప్ లోకి డెంటిస్ట్ దొరికిపోయారు. ప్రస్తుతం తాను ట్రేడింగ్ చేస్తుంటానని.. రోజుకు రూ.4-5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా చెప్పి.. తనతో ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు గడించొచ్చంటూ ఆశ పెట్టింది. ఆమె మాటలను గుడ్డిగా నమ్మిన సదరు డాక్టర్.. ఆమె ప్రపోజల్ కు ఓకే చెప్పేసి.. సెప్టెంబరు 3న ఆమె చెప్పిన ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ లో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టగా.. అందుకు లాభంగా రూ.8.6 లక్షలు లాభం వచ్చినట్లుగా చూపించింది. ఆ మొత్తంలో రూ.85వేల మొత్తాన్ని విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో మోనికను సదరు వైద్యుడు మరింతగా నమ్మాడు.
అనంతరం ఇద్దరం కలిసి రూ.10 కోట్లు పెట్టుబడిగా పెడదామన్న ఆమె ప్రపోజల్ కు ఓకే చెప్పాడు. తన వద్ద ఉన్న డబ్బులకు అదనంగా అప్పులు చేసి మరీ విడతల వారీగా రూ.14.51 కోట్ల మొత్తాన్ని ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్ లో చెల్లింపులు జరిపాడు. దీనికి రూ.34 కోట్లు లాభం వచ్చినట్లుగా సదరు అప్లికేషన్ చూపించింది. లాభాల్ని విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినంతనే.. విత్ డ్రా ఆప్షన్ ను క్లోజ్ అయ్యింది. ఇదేమిటని సదరు మహిళను ప్రశ్నించే వేళలో.. ఆమె కూడా ఆన్ లైన్ నుంచి మాయమైంది. ఆమెను సంప్రదించకుండా ఉండేలా ఆమె ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది.
దీంతో ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్ లోని కస్టమర్ కేర్ ను సంప్రదించగా రూ.7.5 కోట్ల పన్ను చెల్లిస్తేనే నగదు విత్ డ్రా అవుతుందని చెప్పటం.. అప్పటికి కానీ కళ్లు తెరవని సదరు వైద్యుడుతాను మోసపోయిన విషయాన్ని అర్థం చేసుకొని లబోదిబో అంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. అప్పటికే బాగా ఆలస్యమైనప్పటికి.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పక్కనే ఉన్న చెన్నైకు చెందిన సదరు మహిళ మీద అంత నమ్మకమే ఉంటే.. కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టే ముందు.. నేరుగా ఫ్లైట్ లో చెన్నైకు వెళ్లి వచ్చి.. కలిసినా ఆమె విషయం అర్థమయ్యేదన్న మాట వినిపిస్తోంది. అయినా.. ముక్కు ముఖం తెలియని వారి మాటల్ని నమ్మి డబ్బుల్ని పెట్టుబడి పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుుకోవాల్సిన అవసరం ఉంది.
