వీళ్లా ఆదర్శం: క్రికెటర్లపై హైదరాబాద్ సీపీ ఫైర్
సహజంగా క్రికెటర్లంటే.. అభిమానం చూపిస్తాం. వారి పట్ల ఎంతో స్ఫూర్తిమంతమైన ఆదరణ కూడా ఉంటుంది.
By: Garuda Media | 7 Nov 2025 3:39 PM ISTసహజంగా క్రికెటర్లంటే.. అభిమానం చూపిస్తాం. వారి పట్ల ఎంతో స్ఫూర్తిమంతమైన ఆదరణ కూడా ఉంటుంది. అయితే.. సురేష్ రైనా, శిఖర్ ధవన్‌లు ఇద్దరూ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం.. ఆయా యాప్‌ల నుంచి కూడా భారీ ఎత్తున సొమ్ము లు తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారులు దాడులు చేసి.. కొన్ని ఆస్తులను సీజ్ చేశారు.
ఈ పరిణామాలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లా ఆదర్శం అంటూ.. మండిపడ్డారు. అభిమానాన్ని అడ్డు పెట్టుకుని బెట్టింగ్ భూతానికి ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. అలాంటి వారు.. ఆదర్శం ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగులకు పాల్పడి.. అనేక మంది అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఎవరు అండగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. అభిమానాన్ని.. సమాజంలో ఉన్న గుర్తింపును అడ్డం పెట్టుకుని బెట్టింగులను ప్రోత్సహించడం ద్వారా క్రికెటర్లు ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. సమాజాన్ని నాశనం చేస్తున్న బెట్టింగులకు.. ప్రచారం చేస్తున్నవారు(క్రికెటర్లు) బాధ్యులు కారా? అని నిలదీశారు. తమకు ఉన్న పరపతిని.. సెలబ్రిటీ హోదాను సమాజానికి ఉపయోగపడేలా వాడుకోవాలని సూచించారు.
అంతేకానీ.. అభిమానించే వేలాది మందిని దారి తప్పేలా చేసి.. వారి మరణాలకు పరోక్షంగా కారకులు కావొద్దని వ్యాఖ్యానించారు. కాగా.. ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగు యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక మంది మరణించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ.. పలు పిటిషన్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కూడా సూచించింది.
