మొన్న 3 గంటల్లో ముంచేస్తే.. ఇప్పుడు గంటలో ముంచేసింది
ఓ పెద్ద మేఘం విరిగి.. వర్షంగా మారి ఒక నగరం మీద తన ఆగ్రహాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది? గురువారం రాత్రి హైదరాబాద్ మహానగర జీవులకు ఇది బాగా అర్థమైంది.
By: Garuda Media | 8 Aug 2025 10:27 AM ISTక్లైడ్ బరస్ట్.. అదేనండి మేఘ విస్పోటనం. ఓ పెద్ద మేఘం విరిగి.. వర్షంగా మారి ఒక నగరం మీద తన ఆగ్రహాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది? గురువారం రాత్రి హైదరాబాద్ మహానగర జీవులకు ఇది బాగా అర్థమైంది. మూడు నాలుగు రోజుల క్రితం మూడు గంటల పాటు ధాటిగా కురిసిన వానకు హైదరాబాద్ మహానగరం ఆగమాగం అయితే.. ఈసారి అంతకు మించి అన్నట్లుగా గంటలోనే కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహనగరం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
శ్రావణ శుక్రవారం.. అందునా రెండో శుక్రవారం అంటే.. వరలక్ష్మివత్రాన్ని గ్రాండ్ గా చేసుకునే రోజు. దీనికి ఒక రోజు ముందు వీధులన్ని కోలాహలంగా ఉంటాయి. పెద్ద ఎత్తున షాకింగ్ తో రోడ్లు కిక్కిరిసి ఉంటాయి. హైదరాబాద్ మహానగరం గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి మహానగరంలో సరిగ్గా సాయంత్రం ఆరున్నర - ఏడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వానతో హైదరాబాద్ మహానగరం ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. వర్షపు తీవ్రతతో ఆగమాగైంది.
దీనికి మూడు నాలుగు రోజుల క్రితమే మూడు గంటల్లో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. అందుకు భిన్నంగా గురువారం రాత్రి గంటలోనే పన్నెండు సెంటీమీటర్లకు పైనే నమోదైన వర్షపాతంతో మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. హైదరాబాద్ లో అత్యధికంగా ఖాజాగూడ (గచ్చిబౌలికి దగ్గరగా ఉండే ప్రాంతం) 13.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చాలా ప్రాంతాల్లో పదకొండు సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైంది.
అమీర్ పేట ఎల్లారెడ్డి గూడ.. యూసఫ్ గూడ శ్రీక్రిష్ణ నగర్ లో వరద పోటెత్తటమే కాదు.. భుజాల్లోతున నీరు ప్రవహించిన వైనంతో స్థానికులు హడలిపోయారు. పలు నాలాలు ఓవర్ ఫ్లో కాగా.. రోడ్లు మొత్తం వరదనీరు ముంచెత్తింది. మొత్తంగా వాహనదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. లక్షలాది మంది తీవ్ర అవస్థలకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి బయలుదేరిన చాలామంది తాము తమ గమ్యస్థానాల్ని చేరుకునేందుకు అయ్యే సమయానికి రెండు రెట్ల అధిక సమయాన్ని రోడ్ల మీద వెచ్చించాల్సి వచ్చింది.
పొంగిపొర్లిన నాలాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనూహ్య రీతిలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా హైదరాబాద్ మహానగర ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. పలు చెట్లు కూలిపోగా.. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వర్షపునీరు చేరి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మొత్తంగా గురువారం గంట పాటు కురిసిన వానను.. హైదరాబాద్ మహానగర జీవి మర్చిపోలేని చేదు గురుతుగా మిగిలుతుందని చెప్పక తప్పదు.
