హైదరాబాద్ ఇస్పెషల్ అదే.. తేల్చిన తాజా రిపోర్టు
జీవన వ్యయం విషయానికి వస్తే సగటున ఒక్కో మనిషికి రూ.31,808.. కుటుంబానికి రూ.1.14 లక్షలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది.
By: Garuda Media | 21 March 2026 12:00 PM ISTదేశంలోని వివిధ మహానగరాలను పోలుస్తూ వెల్లడైన రిపోర్టు ఒకటి హైదరాబాద్ మహానగర ప్రత్యేకతను వెల్లడించింది. ప్రాంతాలు.. మతాలు.. కులాలకు అతీతంగా ఎవరొచ్చినా సరే.. అక్కున చేర్చుకునే పెద్ద మనసు హైదరాబాద్ మహానగర ఇస్పెషల్ గా చెప్పాలి. ఉపాధి కోసం వచ్చే కడు బీదవారు మొదలు వందల కోట్లు పెట్టుబడులు పెట్టే సత్తా ఉన్న పెట్టుబడిదారుల వరకు అందిని అక్కున చేర్చుకోవటం హైదరాబాద్ ప్రత్యేకతగా చెప్పాలి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో అవకాశాలు.. సదుపాయాలు పుష్కలంగా ఉన్న విషయాన్ని అంతర్జాతీయ గణాంకసంస్థ నంబియో తన రిపోర్టులో వెల్లడించింది.
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగర జీవన వ్యయం తక్కువగా తేల్చింది. ఇంటి అద్దెను మినహాయిస్తే.. రూ.12వేలతో కూడా బతికేయొచ్చని వెల్లడించింది. ఈ నెలలో నుంబియో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం దేశంలోని ఇతర ప్రధాన నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. కొనుగోలు శక్తిలో మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో నిలవటం విశేషం. ఇక్కడ సంపాదించే డబ్బులతో ఇతర నగరాల కంటే ఎక్కువ సౌకర్యాల్ని పొందే వీలుంది.
జీవన వ్యయం విషయానికి వస్తే సగటున ఒక్కో మనిషికి రూ.31,808.. కుటుంబానికి రూ.1.14 లక్షలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది. అద్దెల విషయానికి వస్తే బెంగళూరు కంటే 33 శాతం తక్కువగా తేల్చారు. ఈ లెక్కలకు బేస్ సిటిగా న్యూయార్క్ ను తీసుకున్నారు. అంటే.. ఆ మహానగరంలో జీవన వ్యయం ఇండెక్స్ ను 100గా తీసుకుంటారు.ఇతర నగరాల సూచీలను దాంతో పోల్చి లెక్కిస్తారు.
నలుగురుకుటుంబ సభ్యుల సగటు ఖర్చులను పరిగణలోకి తీసుకొని స్కోర్ ఇస్తారు. ఆహారపదార్థాల నుంచి ప్రజా రవాణా.. విద్యుత్.. నీరు.. ఇంటర్నెట్.. దుస్తులు.. ఇలా ప్రతి ఉత్పత్తి ధరను వాటి బరువుతో గుణించి బాస్కెట్ కాస్ట్ ను నిర్దారిస్తారు. ఇలా న్యూయార్క్ మహానగరంతో లెక్కించి చూసినప్పుడు హైదరాబాద్ మహానగరం అందరిని ఆకట్టుకోవటమే కాదు.. ఎవరినైనా అక్కున చేర్చుకోవటం భాగ్యనగరి ప్రత్యేకతగా చెప్పకతప్పదు.
