Begin typing your search above and press return to search.

దేవుడా.. 25 వేల కేజీల కల్తీ మసాలా దినుసులు!

ఊహకు కూడా అందని రీతిలో జరుగుతున్న భారీ కల్తీ దందాను హైదరాబాద్ నగర పోలీసులు గుట్టురట్టు చేశారు.

By:  Garuda Media   |   5 Aug 2026 12:10 PM IST
దేవుడా.. 25 వేల కేజీల కల్తీ మసాలా దినుసులు!
X

ఇప్పటివరకు కల్తీ వస్తువుల్ని పట్టుకున్న ఘటనలు చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పేది మాత్రం అలాంటి ఇలాంటిది కాదు. విన్నంతనే వణుకు పుట్టటమే కాదు.. ఏం కొనాలి? ఎక్కడ కొనాలి? ఏం తినాలి? తినే వస్తువు అసలా? నకిలీనా? అన్న సందేహంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఊహకు కూడా అందని రీతిలో జరుగుతున్న భారీ కల్తీ దందాను హైదరాబాద్ నగర పోలీసులు గుట్టురట్టు చేశారు. నిత్యం వంటలో వినియోగించే మసాలాలను దారుణంగా కల్తీ చేయటంతో ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీసే దుర్మార్గం వెలుగు చూసింది.

ఈ కల్తీ మసాలాల దంద ఏళ్ల కొద్దీ సాగుతున్నట్లుగా చెబుతున్నారు. నాసిరకం దినుసులకు రసాయనాలు కలిపి ప్రాసెస్ చేయటమే కాదు.. వాటిని ఆకర్షణీయంగా మార్చి.. బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్లోకి వదలుతున్న వైనం చూస్తే.. దేవుడా.. అనుకోకుండా ఉండలేం. మరింత షాకింగ్ నిజం ఏమంటే.. ఈ కల్తీ మసాలాలను పరీక్షల్లోనూ దొరకని రీతిలో సిద్దం చేయటం. తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మసాలాలు ఎంతో తెలుసా? అక్షరాల 25 వేల కేజీలు. ఇవి కాకుండా.. వేలాది కేజీలకు సంబంధించిన వివరాల్ని పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

మైలార్ దేవ్ పల్లి.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా మసాలా దినుసులు కల్తీ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు డీసీపీ వైభవ్ గైక్వాడ్ నాయకత్వంలో హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్స్) పోలీసులు..జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడులు ఇప్పుడు అధికార వర్గాలు సైతం విస్మయానికి గురయ్యే పరిస్థితి.

మొత్తం 13 యూనిట్లపై మెరుపు దాడులు చేపట్టి.. 25వేల కేజీల మసాలా దినుసుల్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 89 వేల కేజీలకు పైనే దినుసులకు సంబంధించి కల్తీ జరిగిందా? లేదా? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో గుర్తించిన అతి పెద్ద కల్తీ రాకెట్ ఇదేనని చెబుతున్నారు. మసాలా దినుసుల కల్తీ సందర్భంగా దుస్తులు.. చీరల తయారీలో వినియోగించే రంగులను మిక్సింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇంతకూ ఈ మసాలా దినుసుల్ని ఎలా కల్తీ చేస్తారన్న విషయాన్ని చూస్తే.. చెమటలు పట్టాల్సిందే. మరీ.. ఇంత దారుణమా? అన్న మాట నోటి నుంచి రాక మానదు.

ఉదాహరణకు తాజాగా పట్టుకున్న మసాలా దినుసుల్లో లవంగాల్నే తీసుకుంటే.. లవంగాల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే నాసిరకం లవంగాలకు.. హానికర కెమికల్స్ ను కలిపి ప్రాసెస్ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీని రంగు చూస్తే.. అత్యంత నాణ్యత కలిగిన లవంగాలుగా కనిపిస్తాయి. వీటికి చీరలకు వేసే రంగులు వేయటం ద్వారా.. నీళ్లల్లో నానబెట్టినా కూడా రంగు పోకుండా ఉంటాయి. ఇదే రీతిలో అవాలు.. షాజీరా.. వాము.. మెంతులు.. జీలకర్ర.. సోంపు.. నువ్వులు లాంటి మసాలా దినుసులను ఇలానే ప్రాసెస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలా కల్తీ చేసిన మసాలా దినుసులు మార్కెట్ ధర కంటే 30 - 50 శాతం తక్కువ ధరలకే అమ్ముతున్నట్లుగా చెబుతున్నారు.

హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఫంక్షన్ల సందర్భంగా క్యాటరింగ్ వారు ఈ నాసిరకం మసాలాలే ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కల్తీ చేసేందుకు వినియోగించే రసాయనాల్లో అమ్మోనియం, మెర్క్యూరీ, లెడ్ వంటివి ఉన్నట్లుగా గుర్తించారు. వీటి కారణంగా కాలేయం.. క్యాన్సర్.. జీర్ణకోశ వ్యాధులు.. మూత్రపిండాలు దెబ్బ తినటం లాంటి ఆరోగ్య సమస్యలతో పాటు.. కడుపు నొప్పి.. అల్సర్.. అలర్జీ.. చర్మవ్యాధులకు అవకాశం ఉందని గుర్తించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి కూడా ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్న ముఠాలపై కల్పబుల్ హోమిసైడ్ ఎమాంగ్ టు ది మర్డర్ నేరారోపణతో ఉండే కఠినమైన సెక్షన్లను చేర్చనున్నారు.

తాజాగా గుర్తించిన ఈ కల్తీ మసాలా రాకెట్ భారీ నెట్ వర్కు ఉందని చెబుతున్నారు. వీరు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లోని వారికి వీరు తమ కల్తీ మసాలాలను సరఫరా చేస్తారని గుర్తించారు. అంతేకాదు.. పలు సూపర్ మార్కెట్లకు కూడా సరఫరా చేస్తారని తెలిసింది. వీరి టర్నోవర్ కోట్లాది రూపాయిల్లో ఉంటుందని చెబుతున్నారు. వీరు ఎవరెవరికి సరఫరా చేశారు? ఎంత భారీగా చేశారు? లాంటి అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి బాధ్యులైన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కొనే ప్రతి వస్తువు నాణ్యత విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకున్నట్లే.

పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ మసాలా దినుసుల లెక్కలోకి వెళితే..

వాము 7920 కేజీలు

జీలకర్ర 6700 కేజీలు

లవంగాలు 550 కేజీలు

షాజీరా 2280 కేజీలు

సోంప్ 540 కేజీలు

అవాలు 4960 కేజీలు

జీలకర్ర పొడి 2350 కేజీలు

మెంతులు 13460 కేజీలు

తెల్ల నువ్వులు 10000 కేజీలు

ముడిసరుకు దాదాపు 90 వేల కేజీలు