Begin typing your search above and press return to search.

ఎంతకు తెగించార్రా.. హైదరాబాద్ లో ఏకంగా డ్ర*గ్స్ ఫ్యాక్టరీ పెట్టేశారు

హైదరాబాద్‌ నగరం మరోసారి డ్రగ్స్‌ మాఫియా అడ్డాగా మారిందని నిరూపించే సంఘటన వెలుగుచూసింది.

By:  A.N.Kumar   |   6 Sept 2025 7:01 PM IST
ఎంతకు తెగించార్రా.. హైదరాబాద్ లో ఏకంగా డ్ర*గ్స్ ఫ్యాక్టరీ పెట్టేశారు
X

హైదరాబాద్‌ నగరం మరోసారి డ్రగ్స్‌ మాఫియా అడ్డాగా మారిందని నిరూపించే సంఘటన వెలుగుచూసింది. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం శనివారం నాడు నిర్వహించింది.

డ్రగ్స్ గుట్టు ఎలా రట్టు అయింది?

ఇటీవల మహారాష్ట్రలో ఒక బంగ్లాదేశ్‌ మహిళను అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తీగ లాగగా.. నేరుగా హైదరాబాద్‌లోని ఈ ఫ్యాక్టరీ వరకు దర్యాప్తు వెళ్లింది. దీంతో చర్లపల్లిలోని ఫ్యాక్టరీలో ప్రత్యేక తనిఖీలు జరిపిన మహారాష్ట్ర పోలీసులు రూ.12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 32 వేల లీటర్ల రా మెటీరియల్ ను కూడా సీజ్ చేశారు.

* 13 మంది అరెస్టు

ఈ ఆపరేషన్‌లో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్, అతని సహచరుడు తానాజీ పాథే ముఖ్యులు. ఇటీవలే వీరిని అనుసంధానంగా మరో 12 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా బయటకు వచ్చింది.

* వాగ్దేవి ల్యాబ్స్ పేరు వెనుక దందా

‘వాగ్దేవి ల్యాబ్స్’ అనే పేరుతో ఈ కెమికల్ ఫ్యాక్టరీకి చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నప్పటికీ, దాని మాటున అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ తయారైన డ్రగ్స్ మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది.

* తెలంగాణలో కలకలం

హైదరాబాద్‌లో అంత భారీ ఎత్తున డ్రగ్స్ ఫ్యాక్టరీ బయటపడటంతో రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ సంఘటనతో డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా వ్యాపించి ఉందో మరోసారి బహిర్గతమైంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ సీజ్ చేయబడింది. మొత్తం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై మళ్లీ చర్చకు దారితీస్తోంది. అధికార యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.