హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజ్.. సీప్లేన్ సేవలకు ప్లాన్
సాధారణ విమానాలతో పోలిస్తే సీ-ప్లేన్‌ల నిర్వహణ కాస్త భిన్నంగా ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా రన్‌వే అవసరం ఉండదు. నీటిపైనే దిగి, నీటిపై నుంచే గాల్లోకి ఎగురుతాయి.
By: Tupaki Political Desk | 10 Aug 2026 1:52 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నాయనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ మధ్య సీప్లేన్ నడపాలని ప్రతిపాదనను సీరియస్ గా పరిశీలిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర విమానయానమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారని చెబుతున్నారు. నిజానికి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సీప్లేన్ నడపాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. దీనిపై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు సీప్లేన్ సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన టూరిజం రంగానికి ఊపు తెస్తుందని అంటున్నారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నుంచి కృష్ణా నది పరివాహక ప్రాంతాల మీదుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో సీప్లేన్ ల్యాండ్ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరికొత్త పర్యాటక సర్క్యూట్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో ఇటీవల ఢిల్లీలో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం.
సాధారణ విమానాలతో పోలిస్తే సీ-ప్లేన్‌ల నిర్వహణ కాస్త భిన్నంగా ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా రన్‌వే అవసరం ఉండదు. నీటిపైనే దిగి, నీటిపై నుంచే గాల్లోకి ఎగురుతాయి. అయితే, దీనికోసం నీటిలో తగినంత లోతు ఉండటంతో పాటు టేకాఫ్, ల్యాండింగ్‌ల కోసం ప్రత్యేకంగా 'వాటర్ ఏరోడ్రోమ్'ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే వీటిలో ప్రయాణికుల సామర్థ్యం కూడా తక్కువగానే ఉంటుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కసారికి 9 నుంచి 12 మంది వరకు మాత్రమే ప్రయాణించే వీలుంటుందని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీ-ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బృందం ఇటీవల హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్వహించిందని అంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లో టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైన పాయింట్లు, ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులపై ఏఏఐ అధికారులు ఆరా తీశారని చెబుతున్నారు. త్వరలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఇదేరీతిలో పరిశీలన జరిపి, సమగ్ర నివేదికను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య సీ-ప్లేన్ టూరిజం తీసుకురావాలన్న ఆలోచనపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రణాళికలు ఊపందుకోవడం పర్యాటక ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సీప్లేన్ ప్రాజెక్టు కనుక పూర్తిగా అమల్లోకి వస్తే, రెండు రాష్ట్రాల మధ్య పర్యాటక రంగం మరింత కళకళలాడటంతో పాటు ప్రయాణ అనుభవమే ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదని అంటున్నారు. ఏపీలో దాదాపు పది ప్రాంతాలకు సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం గత ఏడాదిగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధం కావడంతో ప్రాజెక్టుకు మరింత సమగ్రత చేకూరినట్లైందని వ్యాఖ్యానిస్తున్నారు.
