గుంజకు కట్టేసి నరకం చూపిన భర్తకు సౌదీ శిక్ష వేయాల్సిందే.. బయటకు రాని విషయాలెన్నో!
భార్యను గుంజకు కట్టేసి బెల్టుతో.. కాళ్లతోనూ ఇష్టారాజ్యంగా హింసించిన వైనానికి సంబంధించిన వైరల్ వీడియో బయటకు రావటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారటం తెలిసిందే.
By: Garuda Media | 18 Sept 2025 9:54 AM ISTపది సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియో వైరల్ గా మారటమే కాదు.. దీన్ని చూసినోళ్లంతా షాక్ తింటున్నారు. కొంతసేపు మనసు మొత్తం చేదుగా మారిపోవటమే కాదు.. మనిషిలో పశువుకు మించిన ఈ పశుత్వం ఏమిటి? అన్న ప్రశ్న అలానే ఉండిపోయే పరిస్థితి. సున్నిత మనస్కులు ఈ వీడియోను చూడకపోతేనే మంచిది. భార్యను గుంజకు కట్టేసి బెల్టుతో.. కాళ్లతోనూ ఇష్టారాజ్యంగా హింసించిన వైనానికి సంబంధించిన వైరల్ వీడియో బయటకు రావటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారటం తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంపై ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి.
అందులో ఒక దానికి ఒకటి పొంతన లేనట్లుగా.. లాజిక్ కు దూరంగా ఉన్న పరిస్థితి. అందులో ముఖ్యమైనవి చూస్తే..
1. అసలు ఈ వీడియో ఎవరు తీశారు? ఎలా బయటకు వచ్చింది?
2. ఇంత దారుణంగా హింసించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేయలేదా? అసలు బాధితురాలి వెర్షన్ ఏంటి?
3. ఇంతకూ ఈ క్రూరమైన హింసకు భర్త తరఫు బంధువులు ఎందుకు సపోర్టు చేశారు?
4. ఇంత జరిగిన తర్వాత బాధితురాలి కుటుంబం ఎక్కడా ఎందుకు కనిపించలేదు?
5. తనను భర్త క్రూరంగా హింసించిన తర్వాత కూడా ఆమె కేసు పెట్టేందుకు ఎందుకు ముందుకు రాలేదు?
6. ఈ వీడియోను తీసిన అసలు ఉద్దేశం ఏమిటి?
7. చూసినంతనే రక్తం మరిగిపోయేలా ఉన్న ఈ వీడియో తాలుకు నిందితుల్లో ఎందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు?
8. ఈ దారుణ ఉదంతం గురించి స్థానికులు ఏమంటున్నారు?
9. రాత్రంతా క్రూరంగా హింసించి ఉదయాన్నే బాధితురాలిని ఎందుకు వదిలేశారు? దీనిపై ఆమె ఏమంటోంది?
లాంటి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు కనిపిస్తాయి. ఈ ఉదంతం మీద ఇప్పటికే భారీగా వార్తలు పబ్లిష్ అయినా.. అన్ని అంశాలను సవివరంగా ప్రస్తావిస్తూ.. మొత్తం ఉదంతాన్ని ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదనే చెప్పాలి. ఇంతకూ ఈ మొత్తం ఉదంతంలోని అన్ని అంశాల్ని ప్రస్తావించటం ద్వారా ఈ అమానవీయమైన ఉదంతంపై పూర్తి అవగాహన కలుగుతుంది.
ప్రేమించి పెళ్లాడి.. నలుగురు పిల్లల్ని ఇచ్చిన భార్యను గుంజకు కట్టేసి.. రాత్రంతా అత్యంత క్రూరంగా.. అమానవీయంగా హింసించిన ఈ దుర్మార్గ ఘటనకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు. ఈ ఊరికి చెందిన గురునాథ్ బాలాజీ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ బతికేవాడు. ఆ సమయంలో బీసీ వర్గానికి చెందిన భాగ్యమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు.. ఇద్దరు ఆడపిల్లలు. నాలుగేళ్లుగా బాలాజీకి చీరాల (ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తుంది) కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉంటూ భాగ్యమ్మకు దూరంగా ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే భాగ్యమ్మకు తల్లిదండ్రులు చనిపోవటం.. ఆమెకు ఎవరూ లేకపోవటంతో తన నలుగురు పిల్లల్ని తీసుకొని బాలాజీ సొంతూరు కలుజువ్వలపాడుకు వచ్చేసి.. అతడికి చెందిన ఇంట్లోనే ఉంటోంది. బతుకుదెరువు కోసం మొదట్లో పశువుల కాపరిగా పని చేసిన ఆమె ఇటీవల స్థానికంగా బేకరిలో పనికి కుదిరారు. డబ్బులు అవసరమైన సందర్భాల్లో భాగ్యమ్మ వద్దకు వచ్చే బాలాజీ బలవంతంగా ఆమె నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 13న డబ్బులు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. అందుకు ఆమె.. ససేమిరా అంది.
దీంతో.. ఆమెను బలవంతంగా తన బంధువులతో కలిపి ఊరి చివర ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లి.. పశువుల పాకలాంటి ప్రాంతంలో అక్కడున్న గుంజలకు ఆమె రెండు చేతులు కట్టేసి.. వీపు భాగం మీద బెల్టుతో అత్యంత దారుణంగా కొట్టసాగాడు. మధ్య మధ్యలో కసి తీరక.. కాళ్లతో.. చేతలతో కొట్టాడు. రాత్రి పదకొండు గంటలకు మొదలైన ఈ నరకం ఉదయం ఐదు గంటల వరకు సాగింది. చివరకు భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక.. తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను..తనను వదిలిపెట్టాలని కోరితే అప్పుడు ఆమెను వదిలారు.
భర్త.. అతడి బంధువుల చెర నుంచి బయటపడిన ఆమె.. నడవలేని స్థితిలో గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లి.. తనకు ఎదురైన దారుణ హింస గురించి చెప్పుకొని సాయం చేయాలని కోరారు. ఆమెకు ఉపశమనం కలిగే చర్యలు చేపట్టి.. ఈ మొత్తం సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇంతకూ ఈ వీడియో ఎందుకు తీశారు? ఎవరు తీశారు? ఏ ఉద్దేశంతో తీశారన్న విషయంలోకి వెళితే.. విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తాయి.
ఈ చిత్రహింసల వీడియోను తీసింది బాలాజీ సోదరుడి కుమారుడు. ఆ వీడియోను తాను ప్రస్తుతం ఉంటున్న మహిళకు చూపించాలన్న ఉద్దేశంతో సోదరుడు కొడుక్కి చెప్పాడు. అతను.. ఊళ్లోని తన స్నేహితుడికి షేర్ చేయటంతో.. అతను ఈ దారుణాన్ని చూడలేక బయటపెట్టటంతో ఇది కాస్తావైరల్ గా మారింది. ఇంత దారుణ హింస జరిగిన నేపథ్యంలో ఇందుకు కారణమైన వారిపై ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు బాధితురాలికి కోరారు. అందుకు ఆమె ససేమిరా అనటమే కాదు.. కేసు వద్దు.. ఇంకేం వద్దు. కాస్తంత భయం పెట్టి నా భర్తను అదుపులో ఉండేలా సాయం చేయాలని పోలీసుల్ని కోరటంతో వారేం అనాలో అర్థం కాని పరిస్థితి.
ఆమె పరిస్థితిని అర్థంచేసుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె చేత ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడు బాలాజీతో పాటు మరో ఇద్దరిపైనా కేసులు పెట్టారు. ప్రస్తుతానికి నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. గంటల వ్యవధిలో అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బాలాజీ బంధువుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకు భాగ్యమ్మను ఇంత చిత్రహింసలు పెడుతుంటే బంధువులు ఎందుకు మద్దతు ఇచ్చారంటే .. ప్రస్తుతం భాగ్యమ్మ ఉంటున్న ఇల్లు భర్తది దాని నుంచి ఆమెను బయటకు పంపితే.. తమకు అంతో ఇంతో వాటా దక్కుతుందన్న పాడు ఆలోచనతో సహకరించారు. ఇంతలా హింసిస్తే.. ఆమె ఊరి విడిచి వెళ్లిపోతుందని.. అప్పుడు ఆమె ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చన్నది మరో దుర్మార్గమైన ఆలోచనగా చెబుతున్నారు. ఇలా ఆస్తితో పాటు.. ఆమెను వదిలించుకోవటానికి వేసిన ఎత్తుగడగా పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెకు ఆసుపత్రిలో చేర్చి..వైద్యం చేయిస్తున్నారు పోలీసులు.
ఈ వీడియో బయటకు వచ్చి.. వైరల్ కావటంతో బాలాజీకి సౌదీ అరేబియాలో తప్పులు చేసిన వారికి ఎలా అయితే చిత్రహిసంలతోకూడిన శిక్షలు వేస్తారో.. అలానే వేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వీడియోపై ఏపీ రాష్ట్ర మమిళా కమిషన్ తీవ్రంగా ఖండించటమే కాదు.. తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్నట్లుగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
