Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పిచ్చి ప్రేమ.. భార్య కోసం 18 టన్నుల చెత్త జల్లెడ పట్టిన భర్త!

భార్య పైన భర్తకు.. భర్త పైన భార్యకు ప్రేమ ఉండడం సహజం.. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆ భర్త చేత ఏకంగా 18 టన్నుల చెత్త జల్లెడ పట్టేలా చేసింది.

By:  Madhu Reddy   |   27 Aug 2025 3:00 AM IST
ఇదెక్కడి పిచ్చి ప్రేమ.. భార్య కోసం 18 టన్నుల చెత్త జల్లెడ పట్టిన భర్త!
X

భార్య పైన భర్తకు.. భర్త పైన భార్యకు ప్రేమ ఉండడం సహజం.. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆ భర్త చేత ఏకంగా 18 టన్నుల చెత్త జల్లెడ పట్టేలా చేసింది. ఇది చూసి ఇదెక్కడి పిచ్చి ప్రేమ రా బాబు అంటూ నెటిజన్స్ సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మరి భార్య కోసం ఆ భర్త ఈ 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టడం ఏంటి? దాని వెనుక అసలు కథ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

భార్య కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన భర్త..

పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గత కొన్ని రోజుల క్రితం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్య పోగొట్టుకున్న పెళ్లి ఉంగరాల కోసం ఒక వ్యక్తి చేసిన తీవ్ర ప్రయత్నాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. చిట్టచివరికి ప్రయత్నం ఫలించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే.. స్టీవ్ వాన్ ఎసెల్ డిక్ సతీమణి జిన్నీస్ తమ ఇంటి గార్డెన్ లో ఉండగా.. చేతిలో ఉన్న పాప్ కార్న్ కింద పడి చల్లా చెదురైంది. ఆ సమయంలో తన చేతికి ఉన్న ఉంగరాలు కూడా పడిపోయాయి. ఆ విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఇక ఆ చెత్తను సేకరించి ఒక సంచిలో వేసింది. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ఆ బ్యాగును తీసుకెళ్లిపోయారు. అయితే అనూహ్యంగా తన చేతికి ఉంగరాలు లేవన్న విషయాన్ని గ్రహించిన ఆమె.. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అవి ఏ సమయంలో కనిపించకుండా పోయాయో తెలిసింది.

పట్టువీడని విక్రమార్కుడిలా..

తన చేతికి ఉన్న ఉంగరాలు పాప్ కార్న్ సంచిలోనే పడిపోయినట్లు అంచనాకి రాగా.. అప్పటికే ఆ చెత్తను డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లిపోయారు. ఇక చేసేదేమీ లేక అవి దొరకవు అని జిన్నీస్ సందేహం వ్యక్తం చేసింది. కానీ ఆమె భర్త పట్టు విడవలేదు. ఆ మరుసటి రోజు తమకు దగ్గర్లో ఉన్న డంపింగ్ యార్డ్ కి వెళ్లి జరిగిన విషయాన్ని స్టీన్ వాన్ వారితో వివరించారు. వారు కూడా ఆ ఉంగరాలను వెతుక్కోవడానికి అంగీకరించగా.. గ్లౌజులు ధరించి, పార తీసుకొని ఉంగరాల కోసం వేట మొదలుపెట్టారు. అతడి ప్రయత్నాలు ఫలించవని అక్కడున్న వారు కూడా సందేహం వ్యక్తం చేసినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు.

ప్రయత్నం సఫలం..

తన భార్యకు ఆ ఉంగరాలు తిరిగి ఇవ్వాలి అని గట్టి ప్రయత్నాలు చేశారు. ఈయన చేస్తున్న ప్రయత్నాలపై డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. "ఆయన చెత్తను వెతకడం మొదలుపెట్టాక.. ఇలా వెతకడం కంటే భార్యకు కొత్త ఉంగరం కొనివ్వడం మంచిది అని నేను చెప్పాలనుకున్నాను. కానీ ఆయన పట్టుదల చూసి జేసీబీతో వ్యర్ధాలు తొలగించి ఆయనకు సహాయం చేశాను" అంటూ తెలిపారు. ఎట్టకేలకు కొన్ని కవర్లను గుర్తించిన స్టీన్ వాన్ అందులో ఒక ఉంగరం గుర్తించగా కొద్దిసేపటికే మరో ఉంగరం కూడా లభించింది. ఇక భర్త కష్టానికి తోడుగా నిలవాలి అనుకున్న భార్య మెటల్ డిటెక్టర్ కొనడానికి వెళ్ళగా భార్యకు ఈ విషయం చెప్పడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ జంట బంధం బలమైనది.. చెత్తలో పడిపోయిన ఉంగరాలు మళ్లీ దొరకడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఆ భర్త ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇంకొంతమంది ఈ జంట పెళ్ళికి ఎంత విలువనిచ్చిందో అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం .