రిపోర్టు: 30 ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యాలు.. ఈ ఏడాది ఎందరంటే?
మూడు పదుల వయసులోనే వ్యాపార సామ్రాజ్యాల్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదు.
By: Garuda Media | 2 July 2026 12:40 PM ISTమూడు పదుల వయసులోనే వ్యాపార సామ్రాజ్యాల్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. మనదేశంలోని యువతరం సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన దానికి భిన్నంగా పెద్ద ఎత్తున స్టార్టప్ లను ఏర్పాటు చేయటమే కాదు.. వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వటమే కాదు.. వ్యాపార రంగంలో తమ సత్తా చాటుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. అవెండస్ వెల్త్ - హురున్ ఇండియా అండర్ 30 లిస్ట్ 2026 రిపోర్టు తాజాగా విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి.
దేశ వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు వయసున్న 102మంది యువ పారిశ్రామికవేత్తలు.. నవతరం వ్యాపార వారసులను ఈ రిపోర్టు గుర్తించింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో అత్యధికులు వ్యాపార బ్యాక్ గ్రౌండ్ లేకుండానే.. తమ స్వశక్తితో సత్తా చాటుతున్న వారే కావటం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరిగింది. ఈ యువ వ్యాపారవేత్తలు ప్రాతినిధ్యం వహిస్తునన సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9లక్షల కోట్లుగా నమోదైంది. వివిధ వయసుల క్యాటగిరీలకు వేర్వేరుగా రిపోర్టులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
మూడు పదులు నిండకుండానే తమదైన వ్యాపార ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న వారిలో 84 శాతం మంది కుటుంబాలకు ఎలాంటి వ్యాపార బ్యాక్ గ్రౌండ్ లేదు. వీరంతా తొలితరం వ్యాపారులే. తమకు తాము సొంత ఆలోచనలతో సంస్థలను స్టార్ట్ చేసి.. సక్సెస్ చేస్తున్న వారే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారందరి వయసు సరాసరి చూస్తే.. 28 ఏళ్లు ఉండటం విశేషం. ఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులుగా 20 ఏళ్ల ఓంకార్ సింగ్ బాత్రా.. ధ్రవ్య షా నిలిచారు.వీరిద్దరిలో ఒకరు స్పేస్ టెక్ కాగా.. మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్ లను నిర్మిస్తున్నారు. గత ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అత్యంత పిన్న వయస్కులుగా 22 ఏళ్లు నమోదైతే.. ఈ ఏడాది మరో రెండేళ్లు తగ్గటం గమనార్హం.
ఈసారి జాబితాలోచోటు దక్కించుకున్న వారి విషయానికి వస్తే.. ప్రతి నలుగురిలో ఒకరు డీప్ టెక్ లేదంటే హార్డ్ టెక్ రంగాలకు చెందినవారే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏఐ ఆధారిత స్టార్టప్ ల సంఖ్య రెట్టింపు కావటం విశేషం. ఈ జాబితాలో మొత్తం ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. స్టార్టప్ కేంద్రంగా బెంగళూరు మహానగరం తన అధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం జాబితాలోని 21 మంది ఈ మహానగరానికి చెందిన వారే. గత ఏడాది ఏడుగురు ఉండగా..ఈసారి అంతకు మూడు రెట్లు పెరిగారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 40 మంది యువ వ్యాపారవేత్తలు మెట్రో నగరాల వెలుపల ప్రాంతాలకు చెందిన వారు కావటం. ఈ యువ వ్యాపారవేత్తల విద్యా సంస్థల్ని చూస్తే.. బిట్స్ పిలానీ టాప్ గా నిలిచింది. గత ఏడాది ఈ విద్యా సంస్థల నుంచి ఏడుగురు ఉంటే..ఈసారి 11కు పెరిగింది.
