'హురున్ ఇండియా రిచ్ లిస్ట్': టాప్ లో ముకేష్.. క్లబ్ లో సూపర్ స్టార్!
భారతదేశంలో బిలియనీర్ల వేగవంతమైన వృద్ధిని కూడా ఈ నివేదిక చూపిస్తుంది. ఈ క్రమంలో.. భారత్ లో మొత్తం బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 350 దాటింది.
By: Raja Ch | 1 Oct 2025 5:52 PM ISTఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2025 14వ ఎడిషన్ ప్రకారం.. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నులుగా నిలిచారు. ఈ సందర్భంగా... రూ.9.55 లక్షల కోట్ల నికర విలువతో వారు టాప్ లో నిలిచారని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆ తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ, అతని కుటుంబం నిలిచింది.
అవును... హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2025 ప్రకారం ముకేష్ అంబానీ, అతని ఫ్యామిలీ టాప్ ప్లేస్ లో నిలవగా.. రూ.8.15 లక్షల కోట్లతో అదానీ & ఫ్యామిలీ ఉన్నారు. మరోవైపు భారత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. ఆమె సంపద విలువ రూ. 2.84 లక్షల కోట్లుగా అంచనా!
పెరిగిన బిలియనీర్స్ సంఖ్య!:
భారతదేశంలో బిలియనీర్ల వేగవంతమైన వృద్ధిని కూడా ఈ నివేదిక చూపిస్తుంది. ఈ క్రమంలో.. భారత్ లో మొత్తం బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 350 దాటింది. వారి సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు కాగా.. ఇది భారతదేశ జీడీపీలో సుమారు సగం అని చెబుతున్నారు. మరోవైపు యువ సంపద సృష్టికర్తలు సంచలనాలు సృష్టిస్తున్నారు.
బిలియనీర్స్ క్లబ్ లో చేరిన షారుఖ్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2025లో చోటు దక్కించుకోవడం ద్వారా తన కెరీర్ లో మరో అరుదైన ఘనత సాధించాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు 2025లో బిలియనీర్ విభాగంలోకి అడుగుపెట్టాడు. రూ. 12,490 కోట్ల నికర విలువతో ఈ క్లబ్ లో చేరాడు.
బిలియనీర్ హబ్ గా ముంబై!:
భారతదేశంలోని బిలియనీర్ల జాబితాలో ఇప్పటికీ దేశ ఆర్థిక రాజధాని ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 451 మంది సంపన్నులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 223 మందితో న్యూఢిల్లీ ఉండగా.. మూడో స్థానంలో 116 మందితో బెంగళూరు ఉన్నాయి.
