ఇంతటి రాక్షసత్వం ఎక్కడ నుంచి వచ్చింది మనిషీ ?
మనిషి అన్నారు. మానవుడు అన్నారు. దానవుడు కాని వాడు అని ఉదారంగా ఉంటాడని అనుకున్నారు.
By: Satya P | 1 April 2026 9:23 AM ISTమనిషి అన్నారు. మానవుడు అన్నారు. దానవుడు కాని వాడు అని ఉదారంగా ఉంటాడని అనుకున్నారు. యుగాలుగా మనిషి అలాగే ఉన్నాడు. నాగరికత చూస్తే మనిషి రాక్షస సంతతి చేతిలో బలి కావడం తప్పించి తాను రాక్షసుడిగా మారలేదు. కానీ ఇది కలియుగం. ఇంకా అయిదు వేల సంవత్సరాలే అయినా కూడా మనిషిని నిలువునా ఆవహించింది. దాంతో మనిషిలోని సత్వ లక్షణాలు పూర్తిగా నశించిపోతున్నాయి. దుష్ట లక్షణాలు విజృంభించి రాక్షసుడిగా మారిపోతున్నాడు. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.
ముక్కలుగా నరికి :
విశాఖలో జరిగిన తాజా ఉదంతంలో ప్రియురాలిని ముక్కలుగా నరికాడు ఒక రాక్షసుడు. తన ప్లాట్ కి పిలిచి నమ్మ బలికి మరీ దారుణానికి ఒడిగట్టాడు. శరీర భాగాలని ముక్క ముక్కలుగా చేసి కొంత భాగాలను పెట్రోల్ పోసి నిర్జన ప్రదేశంలో తగులబెట్టాడు. మరి కొంత ఇంట్లో ఫ్రిజ్ లో దాచాడు. మరి కొన్ని ఒక బాక్స్ లో పెట్టాడు. ఇలా ఒక మనిషి శరీర భాగాలను కూరగాయలు తరిగినట్లుగా తరిగాడు అంటే మనిషి అందామా అన్న చర్చ వస్తోంది.
క్రూరత్వం పీక్స్ :
మనిషిలో క్రూరుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. క్రూరత్వానికి రాక్షసత్వానికి ప్రతీకగా ఇలాంటి వారు కనిపిస్తున్నారు. వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ గా ఉంటున్నారు. సమాజంలో హోదాతో కనిపిస్తున్నారు. చదువరులుగా ఉంటున్నారు. కానీ వారి మెదడు మాత్రం పూర్తిగా వికృతమైన ఆలోచనలతో నిండిపోతుంది. గతంలో అయితే గొడవలు వస్తే ఘర్షణ పడేవారు. లేదా దూరం జరిగేవారు. కానీ ఇటీవల మాత్రం హత్యలే చేస్తున్నారు. ఆ హత్యలు కూడా ఒక్కొక్కటీ ఒక్కో పరిశోధన మాదిరిగా చేస్తున్నారు. ఎన్నో విషయాలను శోధించి మరీ ఎలా హత్య చేయాలో సామాజిక మాధ్యమం ద్వారా ఇంటర్నెట్ ద్వారానో తెలుసుకుంటూ వాటిని ప్రయోగిస్తున్నారు.
బరితెగించిన వైనం :
సమాజంలో బరితెగింపు కనిపిస్తోంది. అందుకే చంపడానికైనా చావడానికైనా సిద్ధపడుతున్నారు. చట్టాలు ఉన్నాయి కానీ నేరం రుజువై శిక్షలు పడేసరికి పుణ్య కాలం దాటిపోతోంది. బహుశా ఇది కూడా నేరాల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం అవుతోంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే నైతికత లేని సమాజం అవిర్భవిస్తోంది. గతంలో భయం ఉండేది. సమాజం చూడకపోయినా చట్టాలు అన్న వాటి మీద అవగాహన లేకపోయినా దేవుడున్నాడనో లేదా పెద్దల వద్ద భయాలు ఉన్న కారణంతోనో ఎవరూ ఇంతటి దుస్సాసహానికి పాల్పడేవారు కాదు, ఇపుడు సమాజం ఒక పరిణామ క్రమంలో సాగుతోంది. అందుకే ఇంతటి విచ్చలవిడితనం ఇంతటి విపరీత పోకడలు అని అంటున్నారు.
ఆ తరం అంతరించింది :
ఈ రోజున సమాజంలో అన్ని వర్గాల వారూ ఉన్నారు కానీ వీరంతా పారిశ్రామిక విప్లవం తరువాత నుంచి పుట్టుకొచ్చిన వారు, భౌతికతకు ఎక్కువ ఆకర్షణలకు ఎక్కువగా గురి అయిన వారు ఉన్నారు. దాంతో భయం భక్తి సమాజం పట్ల బద్ధుడిగా ఉండే ఒక తరం అంతరించిపోయింది. మంచి చెప్పే వారు లేరు, చెప్పినా వినే వారు లేరు. అందరికి అందరూ ఒక్కటే అన్న భావన ఉంది. అందుకే ఒక్క మాట పెద్దలు చెబుతూ ఉంటారు, ఏది అయినా పోతే తిరిగి సాధించగలం కానీ నైతికత పోతే అసాధ్యం అని. నైతిక విలువలు కనుమరుగు అవుతున్న తరుణంలో మానవుడిలో లోలోపల దాగున్న దానవుడు బయటకు నిస్సిగ్గుగా వస్తున్నాడు. అందుకే ప్రతీ రోజూ ఎన్నో దారుణాలను చవి చూడాల్సి వస్తోంది అన్నది సామాజిక విశ్లేషకుల మాటగా ఉంది.
